పొల్యూషన్ ఎఫెక్ట్ : ఢిల్లీ వదిలి జైపూర్ వెళ్లిన సోనియాగాంధీ

 పొల్యూషన్ ఎఫెక్ట్ : ఢిల్లీ వదిలి జైపూర్ వెళ్లిన సోనియాగాంధీ

ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి పెరగడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాత్కాలికంగా జైపూర్‌కు వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జైపూర్ లో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు.  రెండు నెలల క్రితం సోనియా గాంధీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోగాలి కాలుష్యం లేని ప్రదేశానికి మారాలని ఆమె వైద్యులు సోనియా గాంధీకి సలహా ఇచ్చారు. దీంతో  సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి జైపూర్ చేరుకున్నారు. 

గతంలో కూడా ఢిల్లీలో కాలుష్యం  పెరిగినప్పుడు సోనియా గాంధీ కొన్ని రోజులు గోవాలో ఉన్నారు.   దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి తీవ్రంగా పెరిగింది.  మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 375(తీవ్ర ప్రమాదకర స్థాయి)కు చేరగా, జైపూర్‌లో ఏక్యూఐ 72(మితస్థాయి)గా నమోదయింది. 

అయితే త్వరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండటం..    సోనియా గాంధీ అక్కడికి చేరుకోవడంతో ఆమె  రాజకీయ సభల్లో, ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వాటిని కాంగ్రెస్ పార్టీ  ఖండించింది. రాజకీయాల కోసం కాదని.. ఆమె ఆరోగ్యం దృష్ట్యానే జైపూర్ చేరుకున్నట్లు స్పష్టం చేశారు.