కొత్త సీఎం ఎవరన్నది సోనియా గాంధీనే నిర్ణయిస్తారు

కొత్త సీఎం ఎవరన్నది సోనియా గాంధీనే నిర్ణయిస్తారు

చండీగఢ్‌: పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీ నిర్ణయిస్తారని సీఎల్పీ (కాంగ్రెస్ శాసన సభాపక్షం) తీర్మానం చేసింది. చండీగఢ్‌లో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పదే పదే తనను అవమానిస్తున్నారంటూ  కెప్టెన్ ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. అనంతరం పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీశ్ రావత్ నేతృత్వంలో ఎమ్మెల్యే మీటింగ్ నడిచింది. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత హరీశ్ రావత్ మీడియాతో మాట్లాడారు.

శాసనసభా పక్షం సమావేశంలో రెండు తీర్మానాలు చేసినట్లు హరీశ్ రావత్ వెల్లడించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా అందించిన సేవలకు ధన్యవాద తీర్మానం చేశామని చెప్పారు. ఇక రెండో తీర్మానం కొత్త సీఎం ఎంపికపై చేసినట్లు చెప్పారు. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే అంశాన్ని సోనియా గాంధీ చేతుల్లో పెట్టామని, ఆమె ఎవరిని ఎన్నుకుంటే ఆ వ్యక్తే సీఎం అవుతారని రావత్ చెప్పారు. ఈ రెండు తీర్మానాలను తాము హైకమాండ్‌కు పంపామని, వాళ్ల నిర్ణయం కోసం వేచి చూస్తామని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ అబ్జర్వర్‌‌గా వచ్చిన సీనియర్ లీడర్ అజయ్ మాకెన్‌ మాట్లాడుతూ కొత్త సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ప్రత్యేకించి ఎటువంటి చర్చ ఈ సమావేశంలో జరగలేదని తెలిపారు.