సోనియా పుట్టిన రోజు..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు : సీఎం రేవంత్

సోనియా పుట్టిన రోజు..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు : సీఎం రేవంత్
  • ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారు : సీఎం రేవంత్
  • గాంధీ భవన్​లో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, వెలుగు : ‘‘2009 డిసెంబర్​ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్​ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు. అది తెలంగాణ ప్రజలకు పండుగ రోజు” అని సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తట్టుకుని, ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. అలాంటి వారికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞతా భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్​లో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

78వ పుట్టినరోజుకు ప్రతీకగా 78 కిలోల కేకును కట్​ చేశారు. రాజ్​భవన్​ నుంచి ఉదయం 10 గంటలకు గాంధీభవన్​కు వచ్చిన సీఎం రేవంత్​ రెడ్డి.. తొలుత సేవాదళ్​ వందనం స్వీకరించారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో కలిసి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్​ కట్​ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తనకు పెద్ద బాధ్యతను ఇచ్చారన్నారు.

సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలను నెరవేరుస్తానని ఆయన​అన్నారు. కార్యకర్తలందరికీ కచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజలదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని రేవంత్​ స్పష్టం చేశారు.

చరిత్రకమైన రోజు : భట్టి

సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడం చరిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సోనియా పుట్టిన రోజు నాడే పునాది పడిందన్నారు. రాష్ట్రం వచ్చినప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంతో తలెత్తుకుని ప్రజలు సంతృప్తిగా జీవించడానికి దశాబ్ద కాలం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వ ఏర్పాటుతో ప్రజలు సోనియా గాంధీకి మంచి కానుకను ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ సర్కారు రాష్ట్ర ప్రజలకు అంకితమన్నారు. 

గాంధీ భవన్​ సాక్షిగా కాంగ్రెస్​ సిద్ధాంతాలు, ప్రజల ఆశయాలు, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజల సంపదను వారికే పంచేందుకు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని భట్టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.