చిత్తూరు: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపురం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ పంపారు. ట్రాక్టర్ ఏజెన్సీతో మాట్లాడి రైతుకు ట్రాక్టర్‌ను ఇంటికే పంపారు బాలీవుడ్ నటుడు. టమోటా రైతు నాగేశ్వరరావు తన పొలంలో దున్నడానికి ఎద్దులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అసలే ఖరీఫ్ సీజన్ కావడంతో అటు పొలం పనులు మొదలు పెట్టలేక.. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వచ్చారు. ఇది ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సాయంత్రానికి వాళ్లకు ట్రాక్టర్ అందిస్తానని ట్వీట్ చేశారు. ఇప్పుడు సోనూసూద్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
