త్వరలో కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు : కేసీఆర్

త్వరలో కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు : కేసీఆర్

రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టం తరహాలో కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను పటిష్టంగా రూపొందించే పనిలో ఉంది సర్కార్. దీనికి సంబంధించిన ప్రగతి భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. అవినీతికి అవకాశం  లేకుండా… ప్రజలకు మరింత బాగా సేవలు అందించేలా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని చెప్పారు.  కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలిచే… IAS అధికారి నాయకత్వంలోని అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లని పిలిచే… ముఖ్య అధికారుల టీముతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాల వంటి పనులన్నీ ఈ అధికారిక టీమ్ ఆధ్వర్యంలోనే జరగాలని వివరించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయాన్ని  పరిశీలించాలన్నారు.

ప్రజలు ఎవరికీ, ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా పని జరగాలన్నారు సీఎం. రెవెన్యూ ఆఫీసుల్లో, మున్సిపాల్టీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పనులు కావాలన్నారు. ఇందుకోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలన్నారు కేసీఆర్. జిల్లా, మండల పరిషత్ లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని చెప్పారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు ముఖ్యమంత్రి. ప్రజల నుంచి తమకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని…. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని జనం చెప్తున్నారని తెలిపారు. ప్రజలు లంచాలు ఇవ్వకుండా పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలన్నారు కేసీఆర్.

భూమి శిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం వచ్చిందన్నారు సీఎం. మారిన పరిస్థితుల్లో కలెక్టర్ అనే పిలవాలా…? లేదంటే జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా…? అనే అంశంపై ఆలోచించాలన్నారు. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో సీఎస్  ఆధ్వర్యంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఉండాలని చెప్పారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఫోకస్ చేయాలన్నారు కేసీఆర్. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో తప్పనిసరిగా వైకుంఠధామం నిర్మించాలని ఆదేశించారు.  రాష్ట్రంలో పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలని చెప్పారు.