
- ప్రత్యామ్నాయమంటిరి..
- ప్రభుత్వ తీరుపై జొన్న రైతుల ఆగ్రహం
- మూడు నెలలుగా ఆరుబయటనే ధాన్యం
పిట్లం, వెలుగు: వరి వేస్తే ఉరే అంటూ.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రచారం చేసిన ప్రభుత్వం.. తీరా దిగుబడు వచ్చాక వాటిని మాత్రం కొనుగోలు చేయడం లేదు. ఇందుకు జిల్లాలోని జొన్న రైతులను ఉదాహరణగా చెప్పవచ్చు. పంట దిగుబడి వచ్చి మూడు నెలలు అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆరు బయట కుప్పలుగా పోసి రాత్రింబవళ్లు కాపలా కాయలేక అవస్థులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం కాపాడుకోవడం వారికి మరింత కష్టంగా మారింది. ఒక వైపు వర్షం మరో వైపు రాత్రి పందులు, పాములు, కోతులతో భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షానికి తడిసి మొక్కలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసే ముందు అధికారులు రైతులతో మీటింగులు పెట్టి వరి వద్దని చెప్పి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారని, ఇప్పుడు పట్టించుకోకుండా నట్టేట ముంచారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సైతం ఇదే పరిస్థితి ఉండడంతో పిట్లం– బాన్సువాడ రోడ్డుపై ధర్నా చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి కొనుగోలు చేసింది. మళ్లీ పరిస్థితి పునరావృతం కావడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నెల 13న పిట్లం మండలం రాంపూర్‌తో పాటు రాజంపేట్ మండలంలో సైతం రైతులు రాస్తారోకో, ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు.
జిల్లాలో లక్షా 25 వేల ఎకరాల్లో..
రబీలో ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలని ప్రోత్సహించింది. వ్యవసాయాధికారులు గ్రామాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసి వరి వేయవద్దని రైతులకు సూచించారు. ఆధికారుల మాటలు విని వారు సూచించిన విధంగానే కామారెడ్డి జిల్లాలో చాలా మంది రైతులు జొన్న పంటను ఎంచుకున్నారు. ప్రభుత్వం జొన్నకు మద్దతు ధర రూ.2,970 నిర్ణయించడంతో మరింత ఉత్సాహంగా సాగు చేశారు. వ్యవసాయాధికారుల రికార్డు ప్రకారం జిల్లా వ్యాప్తంగా 16,570 మంది రైతులు లక్షా 25 వేల ఎకరాలలో జొన్న సాగు చేశారు. అయితే దిగుబడులు వచ్చి మూడు నెలలు అవుతోంది. జొన్నలను గ్రామ శివారులో కుప్పలుగా పోసి ప్రతిరోజు కాపాలగా ఉంటున్నారు. దాదాపు 5.56 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తున్నాయి. వద్దన్న వరిని కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆధికారుల మాట విని సాగు చేసిన జొన్నలు ఎందుకు కొనడంలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మూడు నెలలుగా కాపలా ఉంటున్నాం
ఆఫీసర్లు చెప్పారని పది ఎకరాల్లో జొన్న సాగు చేశా. పంట దిగుబడి వచ్చి మూడు నెలలు అవుతున్నది. అప్పడు జొన్న వేయమని చెప్పిన అధికారులు ఇప్పుడు జాడ లేరు. నా ధాన్యం 200 క్వింటాళ్ల వరకు ఉంది. మూడు నెలలుగా కుప్పల వద్ద కాపలా ఉంటున్నా.
- పోచయ్య మహరాజ్,
రైతు, రాంపూర్