ఐపీఎల్ ఎప్పుడు జరిగినా జీతాల్లో కోతలు ఉండవు: గంగూలీ

ఐపీఎల్ ఎప్పుడు జరిగినా జీతాల్లో కోతలు ఉండవు: గంగూలీ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు జరిగినా జీతాల కోత విధించబోమని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఒకవేళ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయితే మాత్రం బీసీసీఐకి రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ మహమ్మారి వల్ల వాయిదా పడుతో వస్తోంది. తదుపరి నోటీస్ వచ్చే వరకు ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనేది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ తోపాటు నవంబర్ లో టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో ఇండియా ఆడాల్సిన నాలుగు టెస్టులు గురించి దాదా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

‘మా ఆర్థిక పరిస్థితిని మేం పరిశీలించాల్సి ఉంది. మా దగ్గర ఎంత మనీ ఉందనేది తెలుసుకోవాలి. ఐపీఎల్ జరగకుంటే బోర్డు తీవ్రంగా నష్టపోతుంది. ఒకవేళ ఐపీఎల్ జరిగితే మాత్రం పే కట్స్ చేయబోం. ఎలాగోలా మేనేజ్ చేస్తాం. నాకు తెలిసి ఆస్ట్రేలియాలో ఇండియా ఐదు టెస్టుల్లో పాల్గొనడం సాధ్యం కాకపోవచ్చు. లిమిటెడ్ ఓవర్స్ గేమ్స్ ఆడాల్సి ఉంది. అలాగే 14 రోజుల క్వారంటైన్ గైడ్ లైన్స్ ను కూడా పాటించాలి. వీటన్నింటి వల్ల ఆ టూర్ కచ్చితంగా పొడిగించే అవకాశాలు ఉన్నాయి’ అని గంగూలీ పేర్కొన్నాడు.