ఖమ్మం జిల్లాలో వరద నియంత్రణకు అంతా సిద్ధం : అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం జిల్లాలో  వరద నియంత్రణకు అంతా సిద్ధం :  అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు :  వరద విపత్తుల నిర్వహణకు పూర్తి స్థాయి లో సిద్ధంగా  ఉన్నట్టు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఎన్ డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, డీఎం కన్సల్టెంట్ డాక్టర్ వజీం ఇక్బాల్, తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్​  మేనేజ్​మెంట్ అథారిటీ కన్సల్టెంట్ గౌతం కృష్ణ తేజ,  బి. అనుపమ, టీజే సండ్ర, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ సమావేశం  నిర్వహించారు. 

గత సంవత్సరం వచ్చిన భారీ వరదలు, విపత్తుల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్రణాళిక తదితర అంశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విపత్తుల సమయంలో రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్, పంచాయతీ రాజ్,  వైద్య ఆరోగ్య,  పశు సంవర్ధక శాఖలు వారి పరిధిలో చేపట్టిన పనుల గురించి చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది 24 గంటల వ్యవధిలో ఖమ్మం నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని, మున్నేరు నదీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. అప్పుడు వరదల్లో ఆరుగురు చని పోయారని గుర్తుచేశారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా  ముంపు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు, ఆపద మిత్ర వలంటీర్లను సన్నద్ధం చేశామన్నారు. 

ప్రజలకు విపత్తు నిర్వహణ పట్ల అవగాహన కల్పించామని చెప్పారు. జిల్లాలో నీటి వనరుల్లో 75 శాతం మాత్రమే నీరు ఉండేలా చూస్తున్నామని, ఎక్కడా చెరువు కట్టలు కొట్టుకొని పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకేరు, మున్నేరు నదులలో వాటర్ గేజ్ లను ఏర్పాటు చేసి నిరంతరం మానిటరింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్​  మాట్లాడుతూ నీటి వనరులు, చెరువులు, చెక్ డ్యాంల వద్ద అవసరమైన చోట పూడికతీత పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో అన్ని రకాల ప్రమాదాలకు ఒకే వేదిక నుంచి సమాచారం అందించేలా చూడాలని సూచించారు.

 కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ నగరంలోని నాలాలను పూర్తి స్థాయిలో పూడీక తీశామన్నారు. అడిషనల్​ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ వరదల సమయంలో అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. అనంతరం కలెక్టర్ డిజాస్టర్ సర్వైవల్  గైడ్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, సీపీవో ఏ. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. పుల్లయ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కళావతి బాయి, ఇరిగేషన్ ఎస్.ఈ. ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్. సత్యనారాయణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆపద మిత్రలు, తదితరులు పాల్గొన్నారు.

మున్నేరు లోతట్టు ప్రాంతాల్లోపర్యటన.. 

మున్నేరు వరదలలో లోతట్టు ప్రాంతాలలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు. మున్నేరు లోతట్టు ప్రాంతాల్లో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి ఆయన పర్యటించారు. కాల్వ ఒడ్డు మున్నేరు బ్రిడ్జి, బొక్కలగడ్డ, వినాయక నిమజ్జన ఘాట్ ప్రాంతం, ప్రకాష్ నగర్, జలగంనగర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 139, పట్టణ ప్రాంతాల్లో 161 మంది యువతను ఆపదమిత్ర కింద నియమించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు. కలెక్టర్​ వెంట జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, సహాయ మున్సిపల్ కయొషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ 

కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్ రూమ్ సీల్ ను పరిశీలించి, తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. భద్రతా సిబ్బంది అలర్ట్​గా ఉండాలని సూచించారు.