
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తుల నుంచి వచ్చే వస్త్రాలను సేకరించే కాంట్రాక్టర్కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 1న గుంటూరుకు చెందిన భక్తులు గాలిగోపురానికి ఎదురుగా ఉన్న వస్త్రాల కౌంటర్లో రెండు చీరలు, లంగా పీస్ ఒకటి రూ.1100 ఇచ్చి కొనుగోలు చేశారు. భక్తుడికి రసీదు ఇవ్వలేదు. అలాగే అన్యమత ప్రచారంతో కూడిన కవర్లో వస్త్రాలను పెట్టి భక్తుడికి అందజేశారు.
దీనిపై ఆయన ఆ రోజే ఈవో రమాదేవికి ఫిర్యాదు చేశారు. దీవతో ఏఈవో శ్రావణ్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం నోటీసులు ఇవ్వగా కాంట్రాక్టరు సుబ్బారావు ఇచ్చిన వివరణపై ఈవో సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో లైసెన్స్ దారుడు కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉన్నందున, ప్రథమ తప్పుగా భావించి లైసెన్స్ రద్దు చేయకుండా రూ.లక్ష జరిమానా విధించారు. మూడు రోజుల్లో ఆ జరిమానా చెల్లించాలని ఆదేశించారు.