సౌతాఫ్రికాలో మరో 2 వారాలు లాక్ డౌన్

సౌతాఫ్రికాలో మరో 2 వారాలు లాక్ డౌన్

జోహాన్నెస్ బర్గ్: కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్ ను మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా ప్రకటించారు. 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 16న ముగుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మూడు నెలలపాటు ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్, మినిస్టర్లు, డిప్యూటీ మినిస్టర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తున్నామన్నారు. టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మనం ఇప్పుడే రిలాక్స్ కాలేం. మరికొన్ని వారాలు, నెలలు ప్రజలు సహకరించాలి. లాక్ డౌన్ ను మధ్యంతరంగా ఆపేస్తే రిస్కులో పడతాం. ఇప్పటివరకు చేసినదంతా వేస్ట్ అవుతుంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, ప్రజల ప్రాణాలను కాపాడటానికే ప్రయారిటీ ఇస్తున్నాం. మరో 2 వారాలు అన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ స్క్రీనింగ్, టెస్టింగ్ ప్రోగ్రామ్ చేపడతాం. పాజిటివ్ వచ్చినవారిని ఇంట్లో కాకుండా ప్రభుత్వ ఆధీనంలోని క్వారంటైన్ లో ఉంచుతాం. రియల్ టైమ్ డేటా కోసం కొవిడ్ 19 ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా స్క్రీనింగ్, టెస్టింగ్,ఐసోలేషన్, హాస్పిటలైజేషన్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాం. ఇప్పటికే హాట్ స్పాట్ లను గుర్తించాం. ఎకనామిక్ మెజర్స్ కోసం సమగ్ర ప్యాకేజీని రూపొందిస్తున్నాం” అని అన్నారు. ఆఫ్రికా దేశాల లీడర్లు అందరితో కలిసి ఆఫ్రికన్ యూనియన్ కొవిడ్ 19 రెస్పాన్స్ ఫండ్ ను ఏర్పాటు చేశామని, ప్రపంచ దేశాల నుంచి మెడికల్ సప్లయ్స్ ఇతర సాయం కోరతామని చెప్పారు.