WTC FINAL 2025: చోకర్స్ కాదు ప్రపంచ ఛాంపియన్స్: 27 ఏళ్ళ తర్వాత సౌతాఫ్రికాకు ఐసీసీ టైటిల్

WTC FINAL 2025: చోకర్స్ కాదు ప్రపంచ ఛాంపియన్స్: 27 ఏళ్ళ తర్వాత సౌతాఫ్రికాకు ఐసీసీ టైటిల్

అద్భుతమైన జట్టు.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు.. స్టార్ ఆటగాళ్లతో కళకలాడుతుంది.. ఐసీసీ టోర్నీ అంటే ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.. 1998 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత 27 ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్స్ లో సౌతాఫ్రికా ప్రస్తావన ఇది.  దురదృష్టవశాత్తు ఆ జట్టు 1998 నుంచి 2024 వరకు ఆ సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏడు సార్లు సెమీ ఫైనల్.. ఒకసారి ఫైనల్ కు చేరుకున్నా ఐసీసీ టైటిల్ గెలవడంలో విఫలమైంది.  డివిలియర్స్, స్మిత్, ఆమ్లా, పొలాక్, డోనాల్డ్, ఎంతిని, లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ ఆ జట్టుకు ఈ 27 ఏళ్లలో టైటిల్ అందించలేకపోయారు.  

ద్వైపాక్షిక సిరీస్ లో అదరగొట్టే సఫారీలు ఐసీసీ టోర్నీల్లో తడబడడం అలవాటైంది. ప్రతి సారి గ్రూప్ స్టేజ్ లో అదరగొట్టి నాకౌట్ చేరుకోవడం.. అక్కడ ఒత్తిడి జయించలేక ఇంటిదారి పట్టడం సౌతాఫ్రికాపై కామన్ అయిపోయింది. చోకర్స్ గా ముద్ర పడ్డ దక్షిణాఫ్రికా జట్టు గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో ఓడిపోవడం ఆ దేశ అభిమానులను తీవ్రంగా బాధించింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో ఇక సౌతాఫ్రికా జట్టు ఐసీసీ టైటిల్ పై ఎవరూ ఆశలు పెట్టుకోలేదు.      

27 ఏళ్ళ నిరీక్షణకు బ్రేక్:
 
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ కు చేరుకున్న తర్వాత ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఐసీసీ టోర్నీలో అద్భుత రికార్డ్ ఉన్న కంగారూల జట్టును ఓడించడం అసాధ్యమని భావించారు. అయితే సమిష్టిగా ఆడితే ఎంత పెద్ద జట్టునైనా ఓడించవచ్చని సౌతాఫ్రికా నిరూపించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 విజేతగా నిలిచి 27 ఏళ్లుగా తమ దగ్గర లేని ఐసీసీ టైటిల్ కరువును తీర్చుకుంది. లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14) ఆస్ట్రేలియాతో ముగిసిన  ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఓపెనర్ మార్కరం (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సూపర్ సెంచరీతో సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.