WTC FINAL 2025: టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై అలవోక విజయం

WTC FINAL 2025: టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై అలవోక విజయం

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14) ఆస్ట్రేలియాతో ముగిసిన  ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు సౌతాఫ్రికా విజయానికి 69 పరుగులు అవసరం కాగా..డేవిడ్ బెడింగ్‌హామ్ (21) సహకారంతో సెంచరీ హీరో ఓపెనర్ మార్కరం (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

బవుమా (66), స్టబ్స్ (8) నాలుగో రోజు త్వరగా ఔటైనా ఒత్తిడి తట్టుకొని మార్కరం, బెడింగ్‌హామ్ (21) కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లారు. సౌతాఫ్రికా టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాదు 27 ఏళ్ళ తర్వాత సఫారీ జట్టు ఐసీసీ టైటిల్ గెలిచింది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలిచింది.   

స్టార్క్ భయపెట్టినా మార్కరం అడ్డుకున్నాడు: 

2 వికెట్ల నష్టానికి 213 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాపై ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న బవుమా (66) ను స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోర్ 217 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టబ్స్ తో కలిసి సెంచరీ హీరో మార్కరం జట్టును ముందుకు తీసుకెళ్లాడు.

స్టబ్స్ 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో సౌతాఫ్రికాపై ఆసీస్ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అయితే మార్కరం, బెడింగ్‌హామ్ జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. విజయానికి 6 పరుగులు కావాల్సిన దశలో మార్కరం ఔటైనా.. కైల్ వెర్రెయిన్ విన్నింగ్ రన్స్ తో సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.  
     
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో   సౌతాఫ్రికా 57.1 ఓవర్లలో 138 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ కాగా.. 282 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి గెలిచింది.   

ఇక మరోవైపు వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన ఆస్ట్రేలియాకు నిరాశే ఎదురైంది. రెండు ఇన్నింగ్స్ ల్లో ఘోరంగా బ్యాటింగ్ చేయడం ఆ జట్టు ఓటమికి కారణమైంది. అంతకముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ప్రస్తుతం ముగిసిన మూడో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ను ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.