ఒకే కాన్పులో 10 మంది జననం

ఒకే కాన్పులో 10 మంది జననం
  • ముగ్గురు ఆడ, ఏడుగురు మగ శిశువులు
  • దక్షిణాఫ్రికా దంపతులు శ్రీమతి సిట్‌హోల్‌ (37) భర్త టెబోగో సోటెట్సీ

ప్రిటోరియా: దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్‌ (37) అనే మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన పది మందిలో ముగ్గురు ఆడ, ఏడుగురు మగ విశువులు ఉన్నారు. ఆమె భర్త టెబోగో సోటెట్సీ మీడియాత మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.  ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్‌ సి–సెక్షన్‌ ద్వారా ప్రసవం జరిగిందని చెప్పారు. ఒకేసారి తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించలేదు. ధృవీకరిస్తే ఇదే ప్రపంచ రికార్డు అవుతుంది. 
నెలలు నిండకుండానే కాన్పు
గొసియామీ థామర సిట్‌హోల్‌ (37) గతంలో కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చిన 7 నెలల 7 రోజులకు నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చినట్లు చెబుతున్నారు. ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్నా ఈ విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. కృత్రిమ గర్భధారణ కోసం చేసే ట్రీట్‌మెంట్ల వల్లే ఇలా ఒకే కాన్పులో ఎక్కువ మంది శిశుశులు జన్మినిచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ఫలదీకరణ చెందిన అండాలను ఎక్కువ మొత్తంలో మహిళల గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారు, అవి సక్రమంగా పెరిగి పిండాలు ఎదిగితే ఎక్కువ మంది శిశువులు జన్మించే అవకాశం ఉంటుందట. ప్రసవం కంటే ముందు కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన గర్భంలో ఆరుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు చెప్పారని, అయితే స్కానింగ్‌ చేయించాక చూస్తే 8 మంది ఉన్నట్లు తేలిందని చెప్పింది. అయితే ప్రసవం జరిగాక 10 మందికి జన్మనిచ్చినట్లు చెబుతున్నారు. పుట్టిన శిశువులను కొద్ది నెలల పాటు ఇంక్యుబేటర్ లోనే ఉంచి పరీక్షించనున్నట్లు సమాచారం.