సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు మస్తు పైసలు

సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు మస్తు పైసలు

నిరుటి కంటే 44 శాతం ఎక్కువ.. రూ. 6,846 కోట్లిచ్చిన కేంద్రం
11 రూట్లలో ప్రైవేట్‌‌ ట్రైన్స్‌‌కు ఓకే.. 3 రూట్లలో తేజస్‌‌ రైళ్లు శాంక్షన్‌‌
ఎస్సీఆర్‌‌లో కొత్తగా 3 లైన్ల డబ్లింగ్‌‌
భద్రాచలం–సత్తుపల్లికి రూ.520 కోట్లు
కాజీపేట–బల్లార్షాకు రూ.483 కోట్లు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగుకేంద్ర బడ్జెట్‌‌‌‌లో సౌత్ సెంట్రల్ రైల్వేకు భారీ నిధులిచ్చారు. నిరుటితో పోలిస్తే 44 శాతం అదనంగా కేటాయించారు. గతేడాది రూ. 4,751 కోట్లిస్తే ఈసారి రూ. 2,095 కోట్లు ఎక్కువగా రూ. 6,846 కోట్లు మంజూరు చేశారు. కొత్త లైన్లు, ఇతర అవసరాలకు రూ. 2,856 కోట్లు.. డబ్లింగ్‌‌‌‌, థర్డ్‌‌‌‌ లైన్‌‌‌‌, బైపాస్‌‌‌‌ కోసం రూ.3,836 కోట్లు, ట్రాఫిక్‌‌‌‌ సౌకర్యాలకు రూ.154 కోట్లు ఇచ్చారు. ఎస్సీఆర్‌‌‌‌ పరిధిలో 11 ప్రైవేట్‌‌‌‌ రైళ్లకు పచ్చజెండా ఊపారు. కొత్తగా మూడు డబ్లింగ్‌‌‌‌ లైన్లు ప్రకటించారు. 3 రూట్లలో తేజస్‌‌‌‌కు ఓకే చెప్పారు. రాష్ట్రంలోని భద్రాచలం––సత్తుపల్లి, కాజీపేట–-బల్లార్షా, కాజీపేట– విజయవాడ థర్డ్‌‌‌‌ లైన్‌‌‌‌, మనోహరాబాద్‌‌‌‌– –కొత్తపల్లికీ భారీగానే కేటాయించారు. ఈ వివరాలన్నింటినీ బుధవారం రైల్‌‌‌‌ నిలయంలో మీడియాకు జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ గజానన్‌‌‌‌ మాల్య  వెల్లడించారు.

ధర్మవరం టు కట్పడి డబ్లింగ్‌‌‌‌

ఈసారి బడ్జెట్‌‌‌‌లో దక్షిణ మధ్య రైల్వేకు కొత్తగా 3 డబ్లింగ్‌‌‌‌ లైన్లు ఇచ్చారు. 2,900 కోట్ల అంచనాతో ధర్మవరం–పాకాల–కట్పడి (290 కి.మీ.) డబ్లింగ్‌‌‌‌ లైన్‌‌‌‌ ప్రకటించారు. 2,480 కోట్లతో గుంటూరు–-బీబీనగర్‌‌‌‌ (248 కి.మీ.), 6260 కోట్లతో అకోలా–డోన్‌‌‌‌ (626 కి.మీ. వయా పుర్ణ, ముద్కేడ్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ మీదుగా) లైన్లు మంజూరు చేశారు. ప్రయాణికుల సౌకర్యాలకు రూ. 672 కోట్లు కేటాయించారు. రోడ్‌‌‌‌ సేఫ్టీ (బ్రిడ్జిలు, ఆర్వోబీ, ఆర్‌‌‌‌యూబీ) కోసం రూ. 540 కోట్లు, ట్రాక్‌‌‌‌ రెన్యువల్స్‌‌‌‌కు రూ. 900 కోట్లు ఇచ్చారు.

పెద్ద ప్రాజెక్టులకు భారీ నిధులు

ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకే బడ్జెట్‌‌‌‌లో ఎక్కువ నిధులిచ్చారు. నడికుడి–-శ్రీకాళహస్తికి రూ.1,198 కోట్లు కేటాయించారు. మన్మాడ్‌‌‌‌–-ముద్కేడ్‌‌‌‌–డోన్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కోసం రూ. 50 కోట్లు, ధర్మవరం–పాకాలకు 25 కోట్లు, లింగంపేట్‌‌‌‌–-జగిత్యాల–నిజామాబాద్‌‌‌‌కు రూ.15 కోట్లు, వైజ్నాథ్‌‌‌‌–వికారాబాద్‌‌‌‌కు రూ.20 కోట్లు, గద్వాల–రాయచూర్‌‌‌‌కు రూ.10 కోట్ల చొప్పున ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌కు కేటాయించారు. చర్లపల్లిలోని శాటిలైట్‌‌‌‌ టెర్మినల్‌‌‌‌కు రూ. 5 కోట్లు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ కు రూ.170 కోట్లు మంజూరయ్యాయి. అక్కన్నపేట్‌‌‌‌–-మెదక్‌‌‌‌, ఎంఎంటీఎస్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ 2, మునీరాబాద్‌‌‌‌–-మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పనులకు రాష్ట్ర సర్కారు నుంచి నిధులు రావల్సి ఉందని మాల్యా తెలిపారు.

11 రూట్లు ప్రైవేట్‌‌‌‌ కూత

ఎస్​సీఆర్ పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్‌‌‌‌ రైళ్లకు అనుమతిచ్చారు. చర్లపల్లి–-శ్రీకాకుళం (డైలీ), లింగంపల్లి–తిరుపతి (డైలీ), గుంటూరు–లింగంపల్లి (డైలీ), చర్లపల్లి=వారణాసి (వీక్లీ), చర్లపల్లి–పన్వేల్‌‌‌‌ (వీక్లీ), విజయవాడ–వైజాగ్ (ట్రై వీక్లీ), తిరుపతి–వైజాగ్ (ట్రై వీక్లీ), చర్లపల్లి–శాలిమార్ (డైలీ), ఔరంగబాద్–-పన్వేల్‌‌‌‌ (బై వీక్లీ), సికింద్రాబాద్​–గౌహతి (బై వీక్లీ), చర్లపల్లి–చెన్నై (డైలీ) రూట్లలో పర్మిషన్‌‌‌‌ ఇచ్చారు. త్వరలోనే ఓపెన్‌‌‌‌ టెండర్‌‌‌‌ వేయనున్నారు. ఏడాదిలో ప్రైవేట్‌‌‌‌ రైళ్లు ట్రాక్‌‌‌‌పైకి వస్తాయని జీఎం మాల్యా తెలిపారు. ఎస్సీఆర్‌‌‌‌ పరిధిలో 3 రూట్లలో తేజస్‌‌‌‌ రైళ్లు నడవనున్నాయి. గుంటూరు–-లింగంపల్లి, ఔరంగాబాద్ప–న్వేల్‌‌‌‌, చర్లపల్లి–-శ్రీకాకుళం మధ్య తేజస్‌‌‌‌ రైళ్లు కూత పెట్టనున్నాయి.

ఈ డిమాండ్ల ఊసేలేదు

ఏళ్లుగా డిమాండ్‌‌‌‌ చేస్తున్న రాష్ట్ర ప్రాజెక్టులను బడ్జెట్‌‌‌‌లో ప్రస్తావించలేదు. మన ఎంపీలు ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. ప్రస్తుత రూటల్లో 3 డబ్లింగ్‌‌‌‌ లైన్లు మినహా కొత్త ప్రాజెక్టులు, లైన్లు మంజూరు చేయలేదు. కాజీపేటను డివిజన్‌‌‌‌గా ప్రకటించాలని ఏండ్లుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు. అక్కడ లోకోషెడ్‌‌‌‌, కాజీపేట కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. వరంగల్‌‌‌‌లో రైల్వే యూనివర్సిటీ,  సికింద్రాబాద్‌‌‌‌లో రైల్వే మెడికల్‌‌‌‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటున్నా పట్టించుకోవడం లేదు. కొత్త రైళ్ల ఊసైతే అస్సలు లేదు. సికింద్రాబాద్‌‌‌‌ నుంచి విశాఖపట్నం, బెంగళూరుకు, పాట్నా, ముంబై, రాజస్థాన్‌‌‌‌, ఢిల్లీలకు రద్దీ ఎక్కువ ఉంటోంది. కానీ ఏ మార్గంలోనూ కొత్త రైళ్లు ప్రకటించలేదు. గద్వాల–మాచర్ల లైన్‌‌‌‌, సూర్యాపేట మీదుగా విజయవాడ,– హైదరాబాద్‌‌‌‌తోపాటు అనేక చోట్ల కొత్త రైళ్ల అవసరం ఉంది.

రాష్ట్ర సర్కారు నిధులియ్యకనే..

కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. నిధులివ్వకపోవడంతో పెండింగ్‌‌‌‌లో పడుతున్నయ్‌‌‌‌. అక్కన్నపేట్–మెదక్‌‌‌‌, ఎంఎంటీఎస్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ 2 ప్రాజెక్టుకు నిధులివ్వాల్సి ఉంది. కాజీపేట కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీ భూ సేకరణ గొడవ నడుస్తోంది. విశాఖ రైల్వే జోన్‌‌‌‌ పనులు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 104 క్రాసింగ్స్‌‌‌‌ తొలగించాం. ఈసారి ప్రయాణికుల వసతులు, భద్రతకు ప్రత్యేక బడ్జెట్‌‌‌‌ కేటాయించారు.

– గజానన్‌‌‌‌ మాల్యా, జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, ఎస్సీఆర్‌‌‌‌