భద్రాచలం వేదికగా ‘సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్’

భద్రాచలం వేదికగా  ‘సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్’

 

  • 'ఛేంజ్ టు లెగసీ' అనే థీమ్‌తో నిర్వహించే ఈ సమ్మిట్ రాష్ట్రంలో ఇక్కడే ఫస్ట్​.. 
  • ఈనెల 27న సమ్మిట్​.. ఇప్పటికే  పలు కార్పొరేట్​సంస్థలకు ఆహ్వానం
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి కలెక్టర్ జితేశ్ వినూత్న ముందడుగు

భద్రాచలం, వెలుగు :   భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న భద్రాచలంలోని ఐటీడీఏ గిరిజన భవన్‌లో ‘సౌత్ ఇండియా సీఎస్ఆర్  సమ్మిట్’ను ప్రతిష్టాత్మకగా నిర్వహిస్తున్నారు. 'ఛేంజ్ టు లెగసీ' అనే థీమ్‌తో నిర్వహించే ఈ సమ్మిట్, తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రాచలంలో జరగడం విశేషం.  టైనీ లూప్​ ఈవెంట్స్ ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక అభివృద్ది కార్యక్రమాలకు ఈ సమ్మిట్​ శ్రీకారం చుట్టింది. 

కొత్త ఆలోచనల ఆవిష్కరణలు.. 

జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవే లేదు. భద్రాచలం ప్రాంతానికి ఉన్న భక్తి, సంస్కృతి, పర్యాటక ప్రాధాన్యతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే జిల్లాలోని బెండాలపాడు, కిన్నెరసాని, బొజ్జిగుప్ప, పర్ణశాల లాంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కలెక్టర్ అనేక చర్యలు చేపట్టారు.

 ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియం అభివృద్ధి చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. మరోవైపు, అటవీ ఉత్పత్తులతో గిరిజన మహిళలు తయారు చేసిన ఆహార పదార్థాలు లండన్ వరకు ఎగుమతి చేస్తున్నారు. స్థానిక సంస్కృతిని కాపాడేందుకు కలెక్టర్​ ‘ఏరు’ ఉత్సవం, గోదావరి హారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

రెండేండ్లుగా భద్రాచలంలో గోదావరి నదీ హారతితో పాటు టూరిజం డెవలప్​మెంట్​ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా జిల్లా అభివృద్ధిలో మరో మైలురాయిని అధిగమించేందుకు ఆయన స్వయంగా పలు కార్పొరేట్ సంస్థలకు లేఖలు రాసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థిరమైన అభివృద్ధి, సామాజిక ఆవిష్కరణలపై అనుభవం ఉన్న ఎనిమిది మంది వక్తలు ప్రసంగించనున్నారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే 10 మంది ఎగ్జిబిటర్లు తమ విజయవంతమైన ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శించనున్నారు.

సీఎస్​ఆర్​ నిధులతో...

కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్​ఆర్​) నిధులతో ఆయా కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యక్రమాలు ఏటా నిర్వహిస్తుంటాయి. కానీ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సరైన ప్రణాళికలు లేక అనేక సంస్థలు వెనకడుగు వేస్తుంటాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలోని సీఎస్ఆర్ కమిటీ గిరిజన గ్రామాల అభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసింది. 

విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో ఈ నిధులను వెచ్చించేలా కార్పొరేట్ సంస్థలను జిల్లా యంత్రాంగం ఒప్పించనుంది. ముఖ్యంగా పాఠశాలల్లో లైబ్రరీలు, కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఆధునిక పరికరాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

మైలురాయిగా  మారడం తథ్యం

టైనీ లూప్​ ఈవెంట్​ ద్వారా సౌత్​ ఇండియా సీఎస్​ఆర్​ సమ్మిట్​తో భద్రాచలం అభివృద్ధి లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఛేంజ్​ టు లెగసీ అనే భావనను ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా ఈ కార్యక్రమం దొహదపడుతోంది.  ‌‌ - సుమంత్ వల్లల, డైరక్టర్​