పోతిరెడ్డిపాడు కెపాసిటి పెంపుపై దక్షిణ తెలంగాణ గరం

పోతిరెడ్డిపాడు కెపాసిటి పెంపుపై దక్షిణ తెలంగాణ గరం
  • ఆందోళనలకు ప్రతిపక్షాల యాక్షన్​ ప్లాన్​
  • శ్రీశైలం నీళ్లన్నీ మళ్లిస్తే తమ పొలాలు
    బీళ్లుగా మారుతాయని రైతుల ఆవేదన
  • ఆత్మరక్షణలో టీఆర్​ఎస్​ లీడర్లు

హైదరాబాద్, వెలుగుపోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కెపాసిటీని డబుల్​ చేయాలని ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై దక్షిణ తెలంగాణ అట్టుడుకుతున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు, రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఈ విషయంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రెండు మూడు రోజులుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఎక్కడికక్కడ పార్టీ ఆఫీసుల్లో, ఇండ్లల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూత్, ఇంటలెక్చువల్స్​ కూడా సోషల్ మీడియా వేదికగా అటు ఏపీ సర్కారు నిర్ణయాన్ని, ఇటు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పరిధిలో ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో శ్రీశైలం నీళ్లన్నీ మళ్లిస్తే తమ పొలాలకు భవిష్యత్ లో నీళ్లు రావని, బీళ్లుగా మారే ప్రమాదం ఉందని ఇక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు.

పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాయి. ఈ నెల 16న ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలపాలని పార్టీ కేడర్ కు బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్  గురువారం పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తా ఈ నిరసనలో పాల్గొని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇదే అంశంపై బుధవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో ఆయన దీక్ష చేయగా.. పార్టీ నేతలు కూడా ఎక్కడికక్కడ దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సైతం గ్రౌండ్​ లెవల్​లో ఆందోళనకు ప్లాన్ చేస్తున్నది. బుధవారం కాంగ్రెస్​ నేతలు గాంధీ భవన్​లో నిరసన దీక్ష చేపట్టారు. గురువారం కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు చైర్మన్​ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ తరలింపును వ్యతిరేకిస్తూ ఒకే గొంతుకగా ఆందోళన చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు పోతిరెడ్డిపాడుపైనా అదే స్థాయిలో ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ ను సంప్రదించిన తర్వాతే జగన్ పోతిరెడ్డిపాడుపై నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.

ఆత్మరక్షణలో టీఆర్ఎస్ నేతలు

పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారు నిర్ణయంతో దక్షిణ తెలంగాణ టీఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏపీ సర్కారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ మనుగడకు ఇబ్బంది అవుతుందని వాళ్లు కలవపరడుతున్నారు. ఈ ప్రాంతంలోని ఇరిగేషన్ పూర్తిగా కృష్ణా నీళ్లపై ఆధారపడి ఉంది. భవిష్యత్ లో కృష్ణా నీళ్లు రావనే అభిప్రాయానికి రైతులు వస్తే టీఆర్ఎస్ నేతలు ఊళ్లలో తిరుగలేని పరిస్థితి రావొచ్చని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే  అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేందుకు దక్షిణ తెలంగాణకు చెందిన టీఆర్​ఎస్​ నేతలు సిద్ధమయ్యారు. మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, జగదీశ్​రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ సీఎం జగన్​ మోసం చేశారని, మాట వరుసకైనా చెప్పకుండా జీవో జారీ చేశారని శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన 203 జీవోపై త్వరలోనే సుప్రీం కోర్టుకు వెళ్తామని జగదీశ్​రెడ్డి చెప్పారు. పోతిరెడ్డిపాడును అడ్డుకొని తీరుతామని మరో మంత్రి పువ్వాడ అజయ్​ బుధవారం అన్నారు.

కృష్ణా బేసిన్ ​ప్రాజెక్టులు అంతంతే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి టీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రధానంగా గోదావరి నీళ్లు, ప్రాజెక్టులపైనే ఫోకస్​ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం కేసీఆర్​ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదే టైమ్​లో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ తొలి టెండర్ ను పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకే పిలిచింది. 2015  జూన్ 11లో దీనికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాటిచ్చారు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం లేదు. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. డిండి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలనే దానిపై సర్వేల మీద సర్వేలు చేస్తూ మొత్తం ప్రాజెక్టునే ప్రమాదంలో పడేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును రెండేండ్లలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి.. నామమాత్రపు పనులతో సరిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా బేసిన్ లోని చిన్న ప్రాజెక్టులైన భక్త రామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీంలను మాత్రమే పూర్తి చేశారు. గట్టు ఎత్తిపోతల పథకం సహా చిన్న తరహా ప్రాజెక్టుల పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో, విడుదల చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు దక్షిణ తెలంగాణ రైతుల నుంచి వస్తున్నాయి.

రూ.2లక్షల కోట్లతో రైతులకు లోన్