ఇవాళ సౌతాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే

ఇవాళ సౌతాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే

పార్ల్‌‌ (సౌతాఫ్రికా):  అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి దిగిపోయిన విరాట్‌‌ కోహ్లీ ఓ ప్లేయర్‌‌గా టీమ్‌‌లో కలిసిపోతాడా? ఇన్నాళ్లూ  లీడర్‌‌గా టీమ్‌‌మేట్స్‌‌కు అడ్వైజ్‌‌ ఇస్తూ, తప్పు చేస్తే గుస్సా అవుతూ కనిపించిన తను.. ఇప్పుడు మరో కెప్టెన్‌‌ మాట వింటాడా? కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఫ్యాన్స్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలివి. మరికొన్ని గంటల్లోనే వీటికి అన్సర్‌‌ లభిస్తుంది. టెస్టుల్లో ఓటమికి రివెంజ్‌‌ తీర్చుకోవడమే టార్గెట్‌‌గా సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా బుధవారం జరిగే తొలి మ్యాచ్​లో టీమిండియా బరిలో నిలిచింది. అందరి ఫోకస్‌‌ విరాట్‌‌ కోహ్లీతో పాటు టెంపరరీ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న  కేఎల్‌‌ రాహుల్‌‌పైనే ఉంది. ఓ బ్యాటర్‌‌గా కోహ్లీ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తిగా మారింది.  అదే టైమ్​లో టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న లోకేశ్‌‌ లీడర్‌‌షిప్‌‌ స్కిల్స్‌‌కు ఈ సిరీస్‌‌ పరీక్ష కానుంది. కాగా, చివరగా సఫారీ గడ్డపై ఆడిన వన్డే సిరీస్​లో ఇండియా 5–1తో నెగ్గడం విశేషం.

కోహ్లీ బ్యాటింగ్‌‌, కేఎల్‌‌ కెప్టెన్సీపై నజర్

తొలుత టీ20, ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీ వదులుకున్నప్పటికీ  కోహ్లీ  వన్డే లీడర్‌‌గా కంటిన్యూ అవ్వాలని అనుకున్నాడు. కానీ, బోర్డు పెద్దలు, సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీని రోహిత్‌‌ కు ఇచ్చి కోహ్లీకి షాకిచ్చారు.ఈ క్రమంలో బీసీసీఐ బాస్‌‌ గంగూలీ కామెంట్స్‌‌తో విరాట్‌‌ విభేదించడం, సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌‌లో ఓటమి, ఆ వెంటనే టెస్టు నాయకత్వానికి గుడ్‌‌బై చెప్పడం చకచకా జరిగాయి. ఇప్పుడు పరిస్థితి చల్లబడింది. కోహ్లీపై ఎక్స్‌‌ట్రా ప్రెజర్‌‌ లేదిప్పుడు. కాబట్టి తను  బ్యాటింగ్‌‌పై ఫోకస్‌‌ పెట్టాలి. ఓ బ్యాటర్‌‌గా తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలి. చివరగా మార్చిలో ఇంగ్లండ్‌‌తో సొంతగడ్డపై ఇండియా ఫుల్‌‌ స్ట్రెంత్‌‌ టీమ్‌‌తో ఆడినప్పుడు రాహుల్‌‌ మిడిలార్డర్‌‌లో బ్యాటింగ్‌‌ చేశాడు. కానీ, ఇప్పుడురోహిత్‌‌ లేకపోవడంతో తనే ఇన్నింగ్స్‌‌ ఓపెన్‌‌ చేస్తానని చెప్పాడు. మరో  ఓపెనర్‌‌గా సీనియర్‌‌ ధవన్‌‌ బరిలోకి దిగడం ఖాయమే.  ఫెయిలైతే  యంగ్‌‌స్టర్‌‌ రుతురాజ్‌‌ టీమ్‌‌లోకి వస్తాడు కాబట్టి ధవన్‌‌ సత్తా చాటి తీరాల్సిందే. కోహ్లీ ఎప్పట్లానే మూడో నంబర్‌‌లో వస్తాడు. మిడిలార్డర్‌‌ బాధ్యతలు సూర్యకుమార్‌‌, పంత్‌‌ చూసుకుంటారు. ఆరో నంబర్‌‌లో యంగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ వన్డే డెబ్యూ చేయనున్నాడు. న్యూజిలాండ్‌‌తో టీ20ల్లో రాణించిన వెంకటేశ్‌‌  ఆరో బౌలింగ్‌‌ ఆప్షన్‌‌గా కూడా పనికొస్తాడు. ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతామని రాహుల్‌‌ హింట్‌‌ ఇచ్చిన నేపథ్యంలో చహల్‌‌కు తోడు అశ్విన్‌‌ నాలుగేళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో బరిలోకి దిగుతున్నాడు. పేస్‌‌ లీడర్​ బుమ్రాకు తోడుగా దీపక్‌‌ చహర్‌‌తో పాటు శార్దూల్‌‌, భువీలో ఒకరు టీమ్​లోకి రానున్నారు.


జోష్‌‌లో సఫారీలు

రెడ్​బాల్​ ఫార్మాట్‌‌లో సక్సెస్‌‌తో సౌతాఫ్రికా ఫుల్​ జోష్​లో ఉంది. ఆ  సిరీస్​ కీలక ఇన్నింగ్స్‌‌లు ఆడిన వన్డే కెప్టెన్‌‌ టెంబా బవూమ అదే కాన్ఫిడెన్స్‌‌తో వన్డేల్లోనూ  రాణించడంతో పాటు కెప్టెన్‌‌గా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక టెస్టులకు రిటైర్మెంట్‌‌ ఇచ్చిన కీపర్‌‌ డికాక్‌‌ ఇప్పుడు కేవలం వైట్‌‌బాల్‌‌ ప్లేయర్‌‌గా కొత్త  లైఫ్‌‌ స్టార్ట్‌‌ చేస్తున్నాడు. మార్‌‌క్రమ్‌‌ వన్డేల్లో అయినా రాణించాలని ఆశిస్తున్నాడు. టెస్టుల్లో ఇండియాను దెబ్బకొట్టిన స్టార్​ పేసర్‌‌ రబాడ చివరి నిమిషంలో ఈ సిరీస్‌‌ నుంచి విత్‌‌డ్రా అవడం ఇండియాకు ప్లస్‌‌ పాయింట్‌‌. 

టీమ్స్‌‌ (అంచనా):

ఇండియా: కేఎల్‌‌ రాహుల్‌‌ (కెప్టెన్‌‌), ధవన్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌, పంత్‌‌, వెంకటేశ్‌‌ అయ్యర్‌‌, దీపక్‌‌ చహర్‌‌, శార్దూల్‌‌/భువనేశ్వర్‌‌, అశ్విన్‌‌, బుమ్రా, చహల్‌‌. 
సౌతాఫ్రికా: డికాక్‌‌ (కీపర్‌‌), జనేమన్‌‌ మలన్‌‌, బవూమ (కెప్టెన్), మార్‌‌క్రమ్‌‌,  డుసెన్‌‌, మిల్లర్‌‌, ప్రిటోరియస్‌‌/లిండే, ఫెలుక్వాయో, జాన్సెన్​, ఎంగిడి, షంసీ. 

పిచ్‌‌/ వాతావరణం

స్లో, ఫ్లాట్‌‌గా ఉండే బోలాండ్‌‌ పార్క్‌‌ వికెట్‌‌పై కొన్ని సర్‌‌ప్రైజెస్‌‌ వచ్చాయి. పదేళ్ల కిందట శ్రీలంక 43 రన్స్‌‌కే ఆలౌటవడం అందులో ఒకటి. అయితే, ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో మాత్రం పెద్ద స్కోర్లు వస్తున్నాయి. చిన్న బౌండ్రీలు ఉండటంతో ఈ మ్యాచ్‌‌లోనూ భారీ స్కోర్లు ఆశించొచ్చు. పార్ల్‌‌లో వెదర్‌‌ వేడిగా ఉంది. వాన సూచన లేదు.