- డీపీఆర్ రెడీ చేస్తున్నామని మంత్రి కోమటి రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) సౌత్ పార్ట్ కు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) రెడీ చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖ ద్వారా తెలిపారు. డీపీఆర్ కోసం కన్సల్టెన్సీ అపాయింట్ చేశామని, రూపకల్పన చేస్తున్నామని లేఖలో స్పష్టం చేశారు.
దీనిపై మంత్రి కోమటి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం తాను రాసిన లేఖకు స్పందించిన కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నార్త్ పార్ట్ ఇప్పటికే మంజూరై టెండర్ దశలో ఉన్నదని, సౌత్ పార్ట్ పట్ల కూడా సానుకూల నిర్ణయం తెలపడంతో పూర్తిస్థాయి రీజినల్ రింగ్ రోడ్డు సాకారమవుతోందన్నారు. ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేలా కేంద్రంతో సమన్వయం చేసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
