- 15% లోటు వానతో ముగిసిన ‘నైరుతి’ సీజన్
- 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు
- గద్వాల జిల్లాలో వర్షపాత లోటు 39%
- నారాయణపేట, హనుమకొండ, నల్గొండ,
- వరంగల్, మేడ్చల్, ఆదిలాబాద్‌లో 30% పైనే లోటు
- మిగులు వానతో ఉన్నది సిద్దిపేట మాత్రమే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాకాలం ముగిసింది. నైరుతి రుతుపవనాలు కూడా పూర్తిగా వాపస్ వెళ్లిపోయాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది చెప్పుకోదగిన స్థాయిలో పెద్ద వర్షాలేవీ పడలేదు. వానల కోసం రైతులు, సామాన్యులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నెలలో అయితే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జులై చివరి వారంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆ వారం రోజుల పాటు మంచి వానలు పడ్డాయి. ఇటు ఆగస్టులోనూ తొలి వారం తప్ప నెలంతా కరువు పరిస్థితులే కనిపించాయి. వర్షాకాలం చివరి నెల అయిన సెప్టెంబర్‌లోనూ ఎక్కువ పడలేదు. దీంతో వర్షపాత లోటు 20 శాతానికి పెరిగిపోయింది. కొద్దిరోజుల క్రితం ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడ్డాయి. దీంతో లోటు వర్షపాతం 20 శాతం నుంచి15 శాతానికి తగ్గింది. కానీ రాష్ట్రమంతా విస్తారంగా పడకపోవడం, పడినచోట ఒకేసారి కుంభవృష్టిలా కురవడంతో పంట పొలాలకు పెద్దగా కలిసి రాలేదు. మరోవైపు అక్టోబర్ నెలలో ఎండలు తీవ్రంగా ఉంటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పీక్ చలికాలం నవంబర్‌లోనే మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టెంపరేచర్లు సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 37 డిగ్రీల మార్క్‌ను చేరుకుంటున్నాయి. ఉక్కపోత తీవ్రంగా ఉంటున్నది. గాలిలో తేమ వంద శాతం వరకు నమోదవుతున్నది. రాబోయే రోజుల్లో ఉక్కపోత తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది15 శాతం లోటువర్షపాతం నమోదైంది. 726.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. కేవలం 615.3 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 39 శాతం లోటు వర్షం కురిసింది. నారాయణపేట, హనుమకొండ జిల్లాల్లో 34 శాతం, నల్గొండలో 32 శాతం, వరంగల్, ఆదిలాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 31 శాతం చొప్పున లోటు వర్షపాతం రికార్డయింది.
వనపర్తిలో 29, నాగర్‌కర్నూల్‌లో 28, మహబూబ్‌నగర్‌లో 27, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌లలో 26, హైదరాబాద్‌లో 25, ఖమ్మంలో 24, సూర్యాపేటలో 21, జనగామ జిల్లాలో 20 శాతం వర్షపాత లోటు నమోదైంది. ములుగు, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాలను నార్మల్ కేటగిరీ కిందనే చూపిస్తున్నా.. ఆయా జిల్లాల్లోనూ మైనస్‌లోనే వర్షపాతం రికార్డ్ అయింది. అంటే ఆ జిల్లాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. కేవలం ఒక్క సిద్దిపేట జిల్లాలోనే13 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువ మాత్రమే వర్షం పడింది.
అకాల వర్షాలు పడే చాన్స్
వర్షాకాలం సీజన్ ముగిసిపోయినా అక్టోబర్, నవంబర్ నెలల్లో అన్‌సీజనల్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. ఆ వర్షాలతో రాష్ట్రానికి కొంతలో కొంతైనా ఊరట లభించే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక, ఎగువన మహారాష్ట్ర, కర్నాటకల్లోనూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులకు పెద్దగా వరదలు రాలేదు. ముఖ్యంగా శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలంలోనూ నీటి నిల్వ వేగంగా పడిపోతున్నది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 93 టీఎంసీల నిల్వ ఉండగా.. డెడ్‌స్టోరేజ్‌కు ఎగువన ఇంకా కేవలం 40 టీఎంసీల నీళ్లున్నాయి. ఎండాకాలం వరకు తాగునీటి కోసం నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నా.. ఏపీ మాత్రం నీటిని తోడడం ఆపడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి 3,800 క్యూసెక్కులు, హంద్రీనీవా మల్యాల లిఫ్ట్ నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించుకుంటున్నది. ఇటు సాగర్‌లోనూ డెడ్‌స్టోరేజ్‌కు ఎగువన 48 టీఎంసీల నిల్వ ఉన్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకైతే ఈ ఏడాది సరైన వరదన్నదే రాలేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 80 టీఎంసీలకుగాను 47 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. అంటే వాడుకోవడానికి ఇంకో 40 టీఎంసీల వాటర్ అందుబాటులో ఉన్నాయి.
