భూపంపిణీల్లో ఆదివాసీలకు అన్యాయం: సోయం బాపూరావు

భూపంపిణీల్లో ఆదివాసీలకు అన్యాయం: సోయం బాపూరావు

న్యూఢిల్లీ, వెలుగు: అటవీ భూముల విష యంలో ఆదివాసీలను బీఆర్ఎస్ సర్కార్  మోసం చేస్తున్నదని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఆధార్ సొసైటీ నేతృత్వంలో  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన -భారీ ధర్నాలో పాల్గొని, మాట్లాడారు. అడవి హక్కుల చట్టం ప్రకారం.. ఆదివాసీకి దక్కాల్సిన భూమి దక్కడం లేదని సోయం బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. 

కేవలం ఒకటి, రెండు ఎకరాలను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు. ఆర్ఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం..ఆదివాసీ తెగలకే పోడు భూములు ఇవ్వాలన్నారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని విజ్ఞప్తి చేశారు.  నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తెగల సంస్మృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆదివాసీ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 9న రాంలీల మైదానంలో 2 లక్షల మందితో  ధర్నా చేయనున్నట్లు సోయం బాపురావు ప్రకటించారు.