ఆదిలాబాద్ పోలీసుల ఆపరేషన్ జ్వాల

ఆదిలాబాద్ పోలీసుల ఆపరేషన్ జ్వాల
  • స్వీయ రక్షణకు విద్యార్థినులకు కరాటేలో శిక్షణ 
  • ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ జ్వాల’కు శ్రీకారం చుట్టారు. విద్యార్థినులకు పోలీసులు కరాటే లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, కాలేజీలో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో విద్యార్థినులకు స్వీయ రక్షణ తప్పనిసరి.. అందుకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

పోలీసులు, ప్రభుత్వ , ప్రైవేటు కరాటే అధ్యాపకుల సహకారంతో ప్రతి రోజూ సాయంత్రం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విడతల వారీగా శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూరు ఎఎస్పీ కాజల్ సింగ్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి,  డీఎస్పీ ఎల్​.జీవన్ రెడ్డి,  ఉపాధ్యాయులు, శిక్షకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.