ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు పోలీస్​అధికారులకు సూచించారు. మంగళవారం డీపీఓలో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న  గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎన్​డీ పీఎస్​, ఎస్సీ, ఎస్టీ, ఎన్​బీ డబ్ల్యూ, మిస్సింగ్ కేసుల వివరాలను తెలుసుకున్నారు. అత్యాచార, పోక్సో కేసుల్లో నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, దోషులను కోర్టు ముందు నిలపాలని ఆదేశించారు. 

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం  ప్రత్యేక  యాక్షన్​ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్స్, ఫేక్ జాబ్ ఆఫర్లు, పెట్టుబడి మోసాలు వంటి వాటి గురించి ప్రజలకు అవగాహనా కల్పించాలన్నారు. 

గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను, మూఢనమ్మకాలను అరికట్టడంలో భాగంగా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాల్లో కళాబృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి కేసులో పురోగతి సాధించాలని, సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 స్పెషల్ లోక్ ఆదాలత్ లో ఉత్తమ ప్రతిభ  కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ మహేందర్, డీస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.