- ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
మెదక్, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. గురువారం హవేలి ఘనపూర్ ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ, ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు భద్రత, పారదర్శక వాతావరణం కల్పించడం ప్రతి పోలీస్ సిబ్బందిపైన ఉన్న ముఖ్య బాధ్యత అని, ఎన్నికలలో శాంతి భద్రతపరంగా పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదని, ఎన్నికల ప్రక్రియను భంగపరిచే యత్నం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, ప్రలోభాల వంటి ఘటనలను చూసిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ ఉన్నారు.
