కామారెడ్డి జిల్లాలో.. 2023 సంవత్సరంలో భారీగా పెరిగిన దొంగతనాలు

కామారెడ్డి జిల్లాలో.. 2023 సంవత్సరంలో భారీగా పెరిగిన దొంగతనాలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఈ యేడు దొంగతనాలు పెరిగాయి. మర్డర్ ​కేసులు గతేడాది కంటే తగ్గాయి. ఓవరల్​గా నిరుడి కంటే ఈ ఏడాది నేరాలు తగ్గినట్లు ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. శనివారం ఆమె జిల్లా పోలీస్​ఆఫీస్​లో మీడియాకు యాన్యువల్​ క్రైమ్​ రిపోర్ట్​ను విడుదల చేశారు. 2023లో 5529 ఎఫ్​ఐఆర్​లు నమోదు అయినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 706 దొంగతనాలు జరిగాయని, గతేడాదితో పోలిస్తే 63  కేసులు పెరిగాయన్నారు. దొంగతనాల్లో 65 శాతం కేసుల్లో నిందితులను అరెస్ట్​ చేసి, వీరి నుంచి 63 శాతం సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు.

జిల్లాలో ఈ ఏడాది 28 మర్డర్లు కాగా, ఇందులో 20  కేసులు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ కేసులన్నింటిలోనూ నిందితులను అరెస్ట్​ చేసినట్లు చెప్పారు. బాలికలపై వేధింపుల కేసులు నిరుడితో పోలిస్తే 29 శాతం తగ్గాయని, ఈవ్​టీజింగ్​కు సంబంధించి 324 ఫిర్యాదులు వస్తే 177 పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. 101 మందికి కౌన్సిలింగ్​ఇచ్చారు. షీ టీమ్స్​641 అవేర్​నెస్​ప్రోగ్రామ్స్​ నిర్వహించిట్లు చెప్పారు. గతేడాది 516 రోడ్​ యాక్సిడెంట్లు జరగగా, ఈ ఏడాది 496 జరిగాయని ఎస్పీ వెల్లడించారు.

240 సైబర్ ​నేరాలు నమోదయ్యాయన్నారు. సీఎస్ఐఆర్​ పోర్టల్ ​ద్వారా 755 సెల్​ఫోన్లు రికవరీ చేశామని, రికవరీలో స్టేట్​లో కామారెడ్డి ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సదాశివ్​నగర్ ​మండలం భూంపల్లిలో దొరికిన యువతి డెడ్​బాడీ కేసు ఎంక్వైరీ చేయగా ఆరుగురి మర్డర్ ​కేసులు బయట పడినట్లు ఎస్పీ సింధూశర్మ చెప్పారు. నిందితులను అరెస్ట్​ చేశామన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా అసెంబ్లీ ఎన్నికలు సక్సెస్​ చేశామన్నారు.

72 ట్రాన్స్​ఫార్మర్ ​దొంగతనాల కేసులను ఛేదించారు. దొంగిలించిన 51 బైక్​లను ఒకే సారి స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.  రానున్న ఏడాదిలో  నేరాలను మరింతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా  పెంచుతామన్నానరు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్​బీ సీఐ చంద్రశేఖర్​రెడ్డి పాల్గొన్నారు.