అసమానతలపై పోరాడిన సోషలిస్టు నేత

అసమానతలపై పోరాడిన సోషలిస్టు నేత

కుల, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సమానత్వమే ఎజెండాగా సోషలిస్టు భావజాలాన్ని కింది స్థాయికి తీసుకువెళ్లిన నేత ములాయం సింగ్​యాదవ్. మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశంలో మతతత్వ శక్తులు బలపడితే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి పెను ప్రమాదమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. దేశంలో ప్రభుత్వాల నయా ఉదారవాద విధానాలు, నిరంకుశ పాలన పేదలు, ధనికులు మధ్య తీవ్ర అగాధాన్ని పెంచుతున్నది. పేదలు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో సోషలిస్టు ఉద్యమమే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం. కుల, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమాజ్ వాదీ ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్​వాది పార్టీ(ఎస్పీ), మతతత్వ, కులతత్వ శక్తులతో పోరాడుతూ సైద్ధాంతికంగా గట్టి పునాదులను నిర్మించుకోగలిగింది. ప్రస్తుతం ఎస్పీకి అఖిలేష్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, ఇప్పటి వరకు పార్టీకి మార్గనిర్దేశకులుగా కొనసాగిన ములాయం సోమవారం కన్నుమూశారు. కానీ ఆయన స్థాపించిన సమాజ్​వాదీ పార్టీ ఇప్పటికీ దేశానికి కొత్త ఆశలు కల్పిస్తూ రాజకీయాలను పునర్నిర్వచిస్తూ కొత్త బలాలను సమీకరిస్తున్నది.

దళిత వాడల్లో తిరుగుతూ..
మొన్నటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎస్పీకి మద్దతుగా భారీ సామాజిక సమీకరణలు జరిగాయి. దీన్ని కొందరు మండల్ తిరుగుబాటుగా, అఖిలేశ్ కాన్షీరామ్ పాత్ర పోషిస్తున్న తీరుగా భావించారు. నిజానికి డాక్టర్ రామ్‌‌మనోహర్ లోహియా ప్రతిపాదించిన సోషలిజాన్ని బలోపేతం చేయడానికి అంబేద్కర్‌‌ను, ఆయన చుట్టూ అల్లుకున్న సామాజిక చర్చను పార్టీ సైద్ధాంతిక చిహ్నంగా స్వీకరించడం కొత్తేమీ కాదు. ‘జాతి తోడో ఆందోళన’ శక్తులతో ‘కుల నిర్మూలన’ శక్తులు చేతులు కలిపిన తర్వాత, యూపీ ప్రజలు మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని కుట్రల వల్ల ప్రజల ఆ తిరుగుబాటు ప్రస్తుతం కనిపించకపోవచ్చు. కానీ అది తప్పకుండా భారతదేశంలో కొత్త రాజకీయాలకు నాంది పలుకుతుంది. నిజానికి ములాయం సింగ్ యాదవ్ తొలినాళ్లలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రచారం చేయడానికి దళితవాడలకు వెళ్లేవాడు. దళితవర్గానికి చెందిన ఓ తల్లీ కొడుకును పోలీసులు సెల్​లో పడేసి, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఓ ఘటనకు ములాయం సింగ్ చలించారు.1967లో తొలిసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఆయన భారీ ర్యాలీ నిర్వహించి జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ములాయం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ.. జనం మధ్య ఉండేవారు. సభా వేదికపైనా అంతే చురుగ్గా వ్యవహరించే వారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఆయనను ‘లిటిల్ నెపోలియన్’ అని పిలిచేవారు. 

మహిళల హక్కుల కోసం..
మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, వారు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందు ఉండాలని కోరుకున్న వ్యక్తి ములాయం సింగ్. మహిళా రిజ్వేషన్​ బిల్లును ఆయన వ్యతిరేకించ లేదు. కానీ ఆ రిజర్వేషన్ ఫలాలు కూడా అన్ని(బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ) వర్గాలకు దక్కాల్సిన అవసరం ఉందని గట్టిగా పోరాడారు.  ములాయంసింగ్‌‌పై అనేక దాడులు జరిగినా ఆయన ఎన్నడూ భయపడలేదు. ‘మై బడే బాప్ కా బేటా నహీ హూ, యే హి హై అపరాధ్’ అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. సమాజ్ వాదీలు, ఇతరులు ఆయనను ‘నేతాజీ’, ‘మహా నాయక్’, ‘పేదల దేవుడు’గా పిలుచుకుంటారు. ములాయం సింగ్ యాదవ్ ఆలోచనలు, ఆచరణలు నేటి తరానికి స్ఫూర్తి.

ప్రధాని కావాల్సిన వారు..
సమానత్వమే ఎజెండాగా సోషలిస్టు భావజాలాన్ని కింది స్థాయికి తీసుకువెళ్లడం కోసం1987లో ములాయం సింగ్ యాదవ్ ‘క్రాంతి రథ యాత్ర’ నిర్వహించారు. గ్రామాలను సందర్శించారు. పేదరికంపై పోరాటం, సంపద సృష్టి, సామాజిక పరివర్తన దిశగా ప్రజలను సమీకరించడం కోసం ప్రయత్నించారు. లోహియా ప్రతిపాదించిన ‘సప్త క్రాంతి’ అనే సోషలిస్ట్ థీసిస్‌‌లో భాగంగా ఆయన లింగం, కుల, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ రథయాత్ర కాంగ్రెస్సేతర శక్తులను కూడగట్టడానికి దారితీసింది. దీని ఫలితంగానే ఆయన1989లో జనతా దళ్ ​నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపొందించడానికి ఆయన భూమి సేన, అక్షరసేనలను ఏర్పాటు చేశారు.1990లో ఇతర సోషలిస్టులతో కలిసి ములాయం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో దేశంలో మతతత్వ శక్తులు బలపడితే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి పెను ప్రమాదం జరుగుతుందని ములాయం అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయకూడదని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ములాయం కాన్షీరామ్‌‌తో కలిసి దళితులు, ఓబీసీలు, మైనారిటీలను ఏకతాటిపైకి తెచ్చే కూటమిని ఏర్పాటు చేసి1993లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. వాస్తవానికి ఈ సామాజిక సమూహాల ఐక్యత జాతీయ స్థాయిలో కొన్ని శక్తుల పునాదులను కదిలించింది. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నప్పటికీ రెండుసార్లూ రక్షణ మంత్రిగానే కొనసాగారు.
-  ప్రొ. ఎస్. సింహాద్రి,అధ్యక్షుడు, సమాజ్​వాదీ పార్టీ, తెలంగాణ