
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ పేరుతో స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. జైల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వీడియోలో రామోజీ ఫిలిం సిటీలో 15 రోజుల పాటు షూట్ చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. కత్తులు పట్టుకున్న ఖైదీలు చుట్టుముట్టినప్పటికీ, నాని ఒంటరిగా చేతిలో ఆయుధం లేకుండా, ఏమాత్రం భయపడకుండా, సీట్లో కూర్చొని ధైర్యంగా వారిని సవాలు చేస్తూ కనిపించడం ఎక్సయిట్ చేసింది.
రెండు జడలు, ముఖం మీద గాట్లు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో నాని పవర్ ఫుల్‌గా కనిపించాడు. చుట్టూ గందరగోళం జరుగుతున్నా, సీట్లో కూర్చొని, కత్తులు పట్టుకున్న గుంపుని కూల్‌గా గమనించడం ఫెరోషియస్‌గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ మూవీతో ‘కిల్’ ఫేమ్ రాఘవ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు.