తెలంగాణను అప్పుల కుప్పగా చేసిన బీఆర్ఎస్ : గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణను  అప్పుల కుప్పగా చేసిన బీఆర్ఎస్ : గడ్డం ప్రసాద్ కుమార్

పరిగి, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి, ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులను జిల్లాకు తెస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పరిగి లోని చిన్నారి ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులు వస్తాయని ఇక్కడి ప్రజలు ఆశతో ఉండేవారని బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందని విమర్శించారు. ఆ రెండు ప్రాజెక్టులను మళ్లీ తెస్తామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అధైర్య పడకుండా ముందుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రామ్మోహన్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.