
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు డాక్టర్లను మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. అక్కడ పనిచేసేందుకు ఇష్టపడేవారికి అదనపు ఆదాయం కల్పించాలని, స్పెషల్ అలవెన్స్‌లు ఇవ్వాలని యోచిస్తోంది. సరైన వసతులు లేకపోవడం, కుటుంబాలు నగరాల్లో స్థిరపడటంతో చాలా మంది డాక్టర్లు పల్లెల్లో పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. హైదరాబాద్‌లోని దవాఖాన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒక వేళ జిల్లాలకు బదిలీ చేసినా కొన్నాళ్లకు మళ్లీ హైదరాబాద్‌లో పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో కుదరకపోతే వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లోని ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇవేవీ సాధ్యపడక గ్రామీణ ప్రాంతాల్లోని దవాఖాన్లలో పోస్టింగ్ వస్తే.. కొందరు డ్యూటీకి గైర్హాజరవుతున్నారని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి దవాఖానలో డ్యూటీ డాక్టర్ల వివరాలను రోగులకు కనిపించేలా బోర్డులు డిస్ప్లే చేయాలని ఇటీవల వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. తద్వారా డుమ్మా డాక్టర్లపై రోగులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటితో పెద్దగా లాభం ఉండటం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పల్లెల్లో పనిచేసేందుకు ఇష్టపడే డాక్టర్లకు అదనపు ఆదాయం, స్పెషల్ అలవెన్స్‌లు కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని యోచిస్తోంది.
రేషనలైజేషన్‌కు కసరత్తు
ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న డాక్టర్ల కంటే, హైదరాబాద్‌లో పని చేస్తున్న డాక్టర్లకు అలవెన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు డాక్టర్లను పంపించేందుకు ఈ అలవెన్స్ పద్ధతిని రివర్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అధికారికంగా అలవెన్స్‌లను సవరిస్తే నిబంధనలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోందని, మరో రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని ఆలోచిస్తోంది. జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉంది. ఈ సమస్యను నివారించే క్రమంలో తొలుత జిల్లాల్లోని ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లకే అదనపు ఆదాయం కల్పించే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచనతో ప్రస్తుతం వైద్యారోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది రేషనలైజేషన్‌కు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎక్సెస్ ఉన్న డాక్టర్లు, సిబ్బందిని కొరత ఉన్న హాస్పిటళ్లకు పంపించనున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడి ముందుకొచ్చే డాక్టర్లకు జిల్లాల్లో పోస్టింగ్ఇవ్వాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.
సౌలతులు కల్పించాలంటున్న డాక్టర్లు
కేవలం కొన్ని పైసలు అదనంగా ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదని డాక్టర్లు అంటున్నారు. అలవెన్స్‌లు కల్పిస్తూనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకూ మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. పల్లెల్లో డాక్టర్లు పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇదివరకే పలుమార్లు డాక్టర్ల సంఘాలు మంత్రిని కోరాయి. ఇక కేవలం ఓపీ చూడటానికి, నైట్ డ్యూటీలకు పరిమితం చేయడంతో పల్లెల్లో పనిచేసేందుకు స్పెషలిస్టులు ఇష్టపడటం లేదని డాక్టర్లు అంటున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్టులను నియమిస్తున్న ప్రభుత్వం, ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన మిషిన్లను సమకూర్చడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్స్ ప్రకారం ఉండాల్సిన అన్ని యంత్రాలు, ల్యాబ్ సౌకర్యాలు కల్పిస్తే పల్లెల్లో పనిచేసేందుకు యువ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ విజయేందర్ అభిప్రాయపడ్డారు