ఫిబ్రవరి 18 నుంచి మేడారం జాతరకు 6 వేల స్పెషల్ బస్సులు

 ఫిబ్రవరి 18 నుంచి మేడారం జాతరకు 6 వేల స్పెషల్ బస్సులు

మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.  మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి  18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లగా వెల్లడించారు.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు  పొన్నం ప్రభాకర్,  సీతక్క  పరిశీలించారు. 

 అనంతరం మేడారంలోని హరిత హోటల్ లో టీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  అంతకుముందు సమ్మక్క, సారక్కలకు దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేసి నిలువెత్తు బంగారాన్ని సమ్పరించుకున్నారు.   మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం చెప్పారు.  జాతరకు దాదాపుగా 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోందని, రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు.