నేరాల పరిశీలనకు ప్రత్యేక సెల్‌

నేరాల పరిశీలనకు ప్రత్యేక సెల్‌
  • నివారణ మార్గాలను గుర్తించేందుకు యాక్షన్‌ ప్లాన్
  • కార్యాచరణ రూపొందిస్తున్న పోలీసులు

హైదరాబాద్,వెలుగు: కంటికి కనిపించరు.కత్తులు,తుపాకులు పట్టరు.ఎక్కడో కూర్చుంటారు ఆన్‌లైన్‌లో అందినంతా దోచేస్తున్నారు.హై సెక్యూరిటితో ఉన్న‌ బ్యాంకుల సర్వర్లు హ్యాక్‌ చేస్తున్నారు. ఖాతాదారుల అకౌంట్స్‌లోని క్యాష్‌ ఖాళీ చేస్తున్నారు. ఇలా రోజురోజు పెరిగిపోతున్న సైబర్‌ ‌నేరాలకు అడ్డుకట్టపడడం లేదు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఫేక్‌ బ్యాంక్‌ అకౌంట్స్, ఫోన్‌ నంబర్స్‌ తప్ప హ్యాకర్లు, ఆన్‌లైన్‌ మోసగాళ్ల అడ్రెస్‌ చిక్కడం లేదు. ఇలాంటి నేరగాళ్లకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. సీఎం కేసీఆర్‌‌ గురువారం ప్రారంభించిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వార సైబర్‌‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. సీఎం ‌చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా అడిషనల్‌ డీజీ స్థాయి అధికారితో  స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా నమోదైన సైబర్‌‌ నేరాలు, రాష్ట్రంలో ఆరేండ్లుగా నమోదైన కేసుల డాటాతో సైబర్‌‌ క్రిమినల్స్‌,బ్యాంక్ అకౌంట్స్,ఫోన్‌ నంబర్స్‌,నేరస్తులు ఉండే ఏరియాలను మ్యాపింగ్‌ చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులోగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు.

యమా డేంజర్‌‌గా లోన్‌ యాప్స్

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ ప్రస్తుతం సామాన్యుల పాలిట శాపంగా మారాయి. ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్ నిర్వాహకుల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ రోజురోజు పెరిగిపోతున్నాయి.బాధితుల ఫోన్‌ డాటాను హ్యాక్‌ చేస్తున్నారు.వ్యక్తిగత వివరాలతో పాటు గ్యాలరీలో ఉన్న ఫొటోలు, వీడియోస్‌ గ్రాబ్‌ చేస్తున్నారు.వాటితో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు.ఇలాంటి కేసులపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా లోన్‌ యాప్స్‌ వేధింపులకు అడ్డుకట్ట పడడం లేదు. తీవ్రమైన వేధింపులు,ఫోటోస్ మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో సర్కులేట్‌ చేస్తే తప్ప క్రిమినల్‌ కేసులు రిజిస్టర్ కావడం లేదు. బాధితుల నుంచి సమాచారం తీసుకుని దర్యాప్తు చేయడంలో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురౌతున్నాయి. ఫేక్‌ అడ్రెస్‌లు,షెల్‌ కంపెనీలతో నిర్వహిస్తున్న లోన్‌ యాప్స్‌లో అసలు నిందితులు పోలీసులకు చిక్కడం లేదు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా రికవరీ కాల్‌సెంటర్‌‌ ఉద్యోగులు, థర్డ్‌ పార్టీ ఏజెన్సీల నిర్వాహకులను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో మళ్లీ కొత్త కాల్‌ సెంటర్స్‌తో లోన్‌ యాప్స్‌ వేధింపులు ప్రారంభం అవుతున్నాయి.

గతేడాది 63 వేల సైబర్‌‌ కంప్లైంట్స్

సైబర్‌‌ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకోవడంలో పోలీసుల కంటే ముందు ఉంటున్నారు.అప్‌డేటెడ్‌ టెక్నాలజీని వాడుకుంటూ వరుస మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించి సిటిజన్‌ ఫైనాన్సియల్‌ సైబర్‌‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌‌ఎంఎస్‌) హెల్ప్‌లైన్‌ నంబర్‌‌కు గతేడాది 45,893 కాల్స్‌ వచ్చాయి. ఇందులో రూ.95.71 కోట్లు సైబర్‌‌ నేరస్తులు దోచేశారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 18 వేల కంప్లైంట్స్‌ రిపోర్ట్‌ అయ్యాయి. ఈ క్రమంలో గతేడాది 63 వేలకు పైగా సైబర్‌‌ నేరాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసుల సంఖ్య పెరిగిపోవడంతో చీటింగ్‌ను బట్టి కేటగిరీలు ఏర్పాటు చేశారు. రూ.లక్షపై పైగా మోసం జరిగిన కేసుల్లో మాత్రమే సైబర్‌‌ క్రైమ్ పీఎస్‌లో కేసులు నమోదు చేస్తున్నారు. నేరాలు జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. సైబర్‌‌ క్రైమ్ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 8828 కేసులు నమోదు

లోన్‌ యాప్స్‌తో పాటు మొత్తం 23 రకాల సైబర్‌‌ మోసాలు ఏటా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో  గత రెండేండ్ల కాలంలో సుమారు 13 రెట్ల కేసులు అధికంగా రిపోర్ట్‌ అయ్యాయి. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 8828 సైబర్‌‌క్రైమ్ కేసులను నమోదు చేశారు. ఇందులో 66 శాతం ఫేక్ కస్టమర్‌‌ కేర్ ఫ్రాడ్స్,అడ్వర్టైజ్‌మెంట్‌ పోర్టల్స్,లోన్స్,జాబ్‌ ఫ్రాడ్స్,హ్యాకింగ్స్,ఫేక్‌లింక్స్,ఓటీపీ,స్పూఫింగ్‌,ఫిషింగ్‌ మెయిల్స్‌,వాట్సాప్,ఫేస్‌బుక్‌ ఫీచర్స్‌తో జరుగుతున్నవే. ఇంటర్‌‌నెట్‌ ఆధారిత సర్విసెస్‌లో దేన్నీ వదలకుండా నేరాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా సుమారు18వేలకు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో తీవ్రతను బట్టి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌ రిజిస్టర్‌‌ చేస్తున్నారు. రూ.లక్షకు పైగా మోసం జరిగిన కేసుల్లో మాత్రమే సైబర్‌‌క్రైమ్ పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. అంతకంటే తక్కువ నష్టం ఉన్న కేసుల్లో స్థానిక లా అండ్‌ ఆర్డర్‌‌ పీఎస్‌లలో కంప్లైంట్‌ తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘‘సైబర్ నేరగాళ్లను ట్రేస్‌ చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాము. ఇతర రాష్ట్రాల పోలీస్ కంటే ఆధుకనిక టెక్నాలజీతో కేసులు డిటెక్ట్‌ చేస్తున్నాము. ఫైనాన్సియల్ ఫ్రాడ్స్‌లో కాల్‌సెంటర్‌ నిర్వాహకులను అరెస్ట్ చేశాము. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మోసం జరిగినా వెంటనే సైబర్‌‌క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.స్థానిక పోలీసులను ఆశ్రయించాలి.’’

–కేవీఎం ప్రసాద్,ఏసీపీ,సైబర్ క్రైమ్,హైదరాబాద్‌