ప్రత్యేక కోర్టు అనుమతి.. బలపరీక్షలో పాల్గొననున్న హేమంత్‌‌‌‌ సోరెన్‌

ప్రత్యేక కోర్టు అనుమతి.. బలపరీక్షలో పాల్గొననున్న  హేమంత్‌‌‌‌ సోరెన్‌

రాంచీ: జార్ఖండ్‌‌‌‌ కొత్త సర్కార్ బల పరీక్షలో ఆ రాష్ట్ర మాజీ సీఎం హేమంత్‌‌‌‌ సోరెన్‌‌‌‌ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చంపయీ సోరెన్ సీఎంగా కొలువుదీరిన కొత్త సర్కార్.. ఈ నెల 5న ఫ్లోర్ టెస్ట్‌‌‌‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా జరిగే ఓటింగ్‌‌‌‌లో హేమంత్ సోరెన్‌‌‌‌ పాల్గొనేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఫ్లోర్ టెస్ట్​లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ హేమంత్ సోరెన్ ఇటీవల పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్​ను రాంచీ ప్రత్యేక కోర్టు శనివారం విచారించింది. హేమంత్ సోరెన్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ.. సోరెన్‌‌‌‌ను ఫ్లోర్ టెస్ట్‌‌‌‌కు అనుమతించరాదన్న ఈడీ చర్య వెనుక ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. ఓటింగ్‌‌‌‌కు ఒక ఎమ్మెల్యేను హాజరుకాకుండా చేయడం ద్వారా ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు.. ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్‌‌‌‌ను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.