కరోనా పేషెంట్లకు స్పెషల్ డైట్ బంద్

 కరోనా పేషెంట్లకు స్పెషల్ డైట్ బంద్

తాత్కాలికంగా నిలిపివేస్తూ డీఎంఈ రమేశ్​రెడ్డి ఉత్తర్వులు
పద్మారావునగర్, వెలుగు:
రాష్ర్టంలో  ప్రభుత్వ టీచింగ్‌ హాస్పిటల్స్​లో కరోనా రోగులకు అందించే  స్పెషల్ కొవిడ్‌ డైట్‌ను  తాత్కాలికంగా నిలిపివేస్తూ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌(డీఎంఈ) రమేశ్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు డ్రైఫ్రూట్స్, మాంసాహారం, పాలు, గుడ్లు, పండ్లు, మినరల్‌ వాటర్‌ వంటి పోషకాహారం గల స్పెషల్ ఫుడ్ అందించేవారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో  జీవో నంబర్​ 298 ప్రకారం 2020 జులై 15 నుంచి కరోనా స్పెషల్ ​డైట్‌ ప్రారంభించారు. బలవర్థకమైన ఆహారం కోసం కొవిడ్‌ రోగులకు రోజుకు రూ.275, ఫ్రంట్​ లైన్​ వారియర్స్​అయిన డాక్టర్లు,  స్టాఫ్ ​నర్సులు, టెక్నికల్ సిబ్బందికి రూ.300 కేటాయించారు.

చికిత్స పొందుతున్న బాధితులతోపాటు  కరోనా రోగులకు సేవలు అందించే డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బందికి ఆయా ఆస్పత్రుల డైట్‌ కాంట్రాక్టర్‌ ద్వారా ఫుడ్ అందజేశారు. సాధారణ రోగులకు అందించే డైట్‌ రోజుకు రూ.40తో పోలిస్తే కరోనా రోగులకు 7 రెట్లు ఎక్కువ మొత్తం కేటాయించారు. రాష్ట్రంలోని పలు టీచింగ్​ హాస్పిటళ్లలో ఇప్పటికీ  ప్రత్యేక వార్డుల్లో కరోనా బాధితులకు ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. కరోనా నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 35 కరోనా కేసులు,16  బ్లాక్‌ ఫంగస్‌  మొత్తం 51 మందికి ట్రీట్​మెంట్​అందిస్తున్నారు.

కాగా, ఈ నెల 25 నుంచి కరోనా డైట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సాధారణ రోగులకు అందించే ఫుడ్​నే కరోనా రోగులకు అందిస్తున్నారు. భవిష్యత్​లో ఒమిక్రాన్ లాంటి వేరియంట్లతో కరోనా  బాధితులు పెరిగితే తిరిగి స్పెషల్ కొవిడ్​ ఫుడ్​ అందజేస్తామని పేర్కొన్నారు.