ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానం.. తెలంగాణ వారి కోసం ప్రత్యేక సెల్ 

ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానం.. తెలంగాణ వారి కోసం ప్రత్యేక సెల్ 

మణిపూర్‌లో జరుగుతున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు ప్రజలు దీనిని ఉపయోగించుకొని క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 

ఇంఫాల్ టూ హైదరాబాద్ ప్రత్యేక విమానం

తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, సమీప ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. మణిపూర్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడున్న తెలంగాణ వారి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇంపాల్ లో  చిక్కుకున్న వారందరినీ తక్షణమే వాయు మార్గంలో తరలించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..  ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. 

ప్రత్యేక సెల్ ఏర్పాటు

మణిపూర్‌ సీఎస్‌తో తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి మాట్లాడారు. మన విద్యార్థులు, పౌరులను సురక్షితంగా పంపించే విషయమై చర్చించారు. మరోవైపు  డీజీపీ అంజనీకుమార్‌ మణిపూర్‌లో చిక్కుకున్న మన వాళ్ల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7901643283ను, dgp@tspolice.gov.in మెయిల్‌ను అందుబాటులో ఉంచారు. ఈ హెల్ప్‌లైన్‌కు డీఐజీ సుమతిని ఇంచార్జిగా నియమించారు. ఆమె బాధితులకు ధైర్యం చెప్తూ, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తున్నారు. హెల్ప్‌లైన్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 45 కాల్స్‌ వచ్చినట్టు డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. వీరిలో విద్యార్థులు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు, చిరువ్యాపారులు ఉన్నారని పేర్కొన్నారు.