‘జై భీమ్’ సినిమా కోసం ట్రైనింగ్ తీసుకున్నా

‘జై భీమ్’ సినిమా కోసం ట్రైనింగ్ తీసుకున్నా

లిజోమోల్ జోస్... అంటే ఎవరా.. అని  కాసేపు ఆలోచిస్తారు. కానీ, ‘జై భీమ్’​లో ‘సినతల్లి’ అంటే మాత్రం టక్కున గుర్తొచ్చేస్తుంది. ‘‘ఆమె నటన, ఎక్స్​ప్రెషన్స్​, నేచురాలిటీ... వావ్​! వాట్​ ఏ పర్ఫార్మెన్స్​...’’ అనకుండా ఉండలేరు. అంత బాగా నటించింది ఆ సినిమాలో. మీడియాలో పనిచేసిన లిజో...అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చింది. కాకపోతే ఏ రంగంలోనైనా రాణించగల సత్తా ఉంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. అలా రాణించాలంటే దానికి తగ్గ హార్డ్​ వర్క్​ చేయాలి. ఆ హార్డ్​ వర్క్​ చేయడం వల్లే ఇప్పుడు లిజో మీద దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

లిజోమోల్​ జోస్...​ ‘జై భీమ్’ సినిమా వచ్చేవరకు ఈమె గురించి మన ఆడియెన్స్​కి తెలియదు. కానీ, మలయాళం, తమిళ సినిమాల్లో మంచి నటిగా పేరుంది. దీనికంటే ముందు తమిళ సినిమా ‘‘శివప్ప మంజల్ పచ్చయ్”, తెలుగులో ‘‘ఒరేయ్​ బామ్మర్ది’’గా డబ్​ అయింది. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్​కు జోడిగా నటించింది లిజో. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఆ సినిమాలో తన నటన చూసే డైరెక్టర్​ జ్ఞానవేల్​ ‘జై భీమ్’లో అవకాశమిచ్చాడు. ఈ రెండు సినిమాల్లో నటించింది లిజోనా? అని పోల్చుకోవడానికి కొంత టైం పట్టొచ్చు. ఎందుకంటే ఆమె ‘‘ఒరేయ్​ బామ్మర్ది’’లో సింపుల్​గా, మిడిల్ క్లాస్ అమ్మాయిలా నటించింది. ‘జై భీమ్’కి వచ్చేసరికి డీ గ్లామరైజ్డ్​​​ రోల్​లో గిరిజన మహిళగా, ప్రెగ్నెంట్​గా, ఎమోషనల్​ రోల్​ చేసింది. అయితే ఇందులో ఆమె నేచురల్​ యాక్టింగ్​, పర్ఫార్మెన్స్​ సినిమాలో ఎమోషనల్స్​ సీన్స్​ని వేరే లెవల్​కి తీసుకెళ్లాయి. ‘‘ఆకాశమే నీ హద్దురా”తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మరో బయోపిక్​  సినిమా ‘‘జై భీమ్​’’.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్​ అందుకుంటోంది. 

అలా మొదటి అవకాశం
‘‘అమృత స్కూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌’’ కాలేజీలో డిగ్రీ చేసింది లిజో. తర్వాత ‘జై హింద్’ అనే చానెల్‌‌‌‌‌‌‌‌లో  సబ్​ -– ఎడిటర్​, స్టాఫ్​ రిపోర్టర్​గా రెండేళ్లు పని చేసి, మానేసింది. జాబ్​ మానేశాక మళ్లీ చదువు కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ‘‘పాండిచ్చేరి యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లైబ్రరీ సైన్స్‌‌‌‌‌‌‌‌’’లో మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చదివింది. ఈ టైంలో లిజో ఫ్రెండ్ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ గ్రూపులో సినిమా ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌ గురించి ఒక యాడ్ వచ్చింది. దాని గురించి లిజోకు చెప్పిందామె. అలా ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌కు తన ఫొటోలు పంపింది లిజో.  రెండు వారాల తర్వాత మూవీ టీం నుంచి ఫోన్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అయితే ‘నాకు  యాక్టింగ్​ రాదు’ అని లిజో చెప్పడంతో... వాళ్లు “రీసెంట్​గా మీరు చూసిన సినిమా గురించి మీ ఫ్రెండ్​కి ఎలా చెబుతారు’’ అనేది చేసి చూపించమన్నారు. లిజో వాళ్లు చెప్పినట్టు చేసింది. అది వారికి నచ్చడంతో సినిమా కోసం తీసుకున్నారు. అలా మొదటి సినిమా ఫాహద్ ఫాజిల్​తో కలిసి నటించిన ‘మహాశింబే ప్రతీకారం’ మూవీ ద్వారా పరిచయమైంది. ‘‘ఒక పక్క షూటింగ్‌‌‌‌‌‌‌‌ అంటే భయపడుతున్న నాకు... డైరెక్టర్ దిలీశ్‌‌‌‌‌‌‌‌ పోతన్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ ఆలోచించే టైం ఇవ్వలేదు. అప్పటికప్పుడు సీన్స్​ చేయడంతో నటించడం వచ్చేసింది’’ అంది లిజో.

2016లో వచ్చిన ‘రిత్విక్‌‌‌‌‌‌‌‌ రోషన్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ సినిమాతో మలయాళ స్టార్‌‌‌‌‌‌‌‌ నటిగా ఎదిగింది. ‘‘ఒరేయ్​ బామ్మర్ది” సినిమా ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌ అప్పుడు తమిళ భాష రాక చాలా ఇబ్బంది పడిందట లిజో. మూడు దశల్లో జరిగిన ఆడిషన్స్‌‌‌‌‌‌‌‌ను ఫేస్​ చేసి, లాస్ట్​కి హీరోయిన్​గా సెలక్ట్ అయింది.
 
జైం భీమ్​ గురించి చెబుతూ...
‘‘నేను మలయాళీ. కాబట్టి తమిళం నేర్చుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు వారాలు నేర్చుకోవడానికే టైం సరిపోయింది. తర్వాత అక్కడి వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. వాళ్ల గుడిసెలకు వెళ్లి రోజూ వాళ్లు చేసే పనిని చూశా. ఆ పని నేర్చుకుని వాళ్లతో కలిసి చేశా. వాళ్లు చీరలు కట్టుకుంటారు. చెప్పులు వేసుకోరు. పగలు, రాత్రి అని తేడా లేకుండా వేటకు వెళ్తారు. అవన్నీ నేను కూడా చేశాను. చెప్పులు లేకుండానే అడవిలో నడిచాను. దానికోసం షాట్​ లేనప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండానే తిరిగాను. షూస్​ వేసుకుంటే, తర్వాత షాట్​ తీసే టైంకి నడకలో తేడా తెలుస్తుంది. అందుకే అలా నడిచాను. ఇవే కాకుండా వాళ్ల వంటలు, వాళ్లు ఇతరులతో ఎలా మాట్లాడతారు? వాళ్లలో వాళ్లు ఎలా మాట్లాడుకుంటారనేది గమనించేదాన్ని. పాము కాటేస్తే మందులు ఇస్తుంటాను నేను ఈ సినిమాలో. అది కూడా నేర్చుకున్నాను. జ్వరానికి, దగ్గుకు ఏ మందులు ఇవ్వాలో తెలుసుకున్నాను. సినిమా కోసమని కాకుండా నిజంగా అడవిలో ఉండే వాళ్లే అన్నట్లు సహజంగా చేయాలి. అంత పర్ఫెక్ట్​గా ఉండాలి. ఎక్స్​పీరియెన్స్ ఉన్నట్టే చేయాలి. అందుకోసం ఈ సినిమాకి ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి నేను అలా ట్రైనింగ్​ తీసుకోలేదు. నేనే కాదు, నాతో కలిసి నటించిన మణికందన్ కూడా పాములు పట్టడం, ఇటుకల బట్టీల్లో పనిచేయడంలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ ట్రైనింగ్ మార్నింగ్ ఏడింటికి మొదలై నెక్స్ట్​​ డే మార్నింగ్ పూర్తయ్యేది.  

చికెన్​ తింటున్న ఫీలింగ్
ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. వాళ్లు ఎలుకలను వేటాడి, కూర వండుకుని తింటారు. అలాగని అన్ని రకాల ఎలుకలు తినరు. పొలాల్లో దొరికేవే తింటారు. వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలి కదా అనుకున్నాను. అందుకే నేను కూడా ఎలుక కూర తిన్నాను. నాకైతే అది తింటుంటే చికెన్​లా అనిపించింది. అయితే... నేను ఎలుకను తిన్నాననే విషయం మా ఇంట్లో తెలిసి ‘‘నువ్వు అది తిన్నావా?’’ అని అడిగారు. నేను వాళ్లకు ఒకటే చెప్పా... ‘‘ఆ కూర తినడం తప్పేం కాదు. వాళ్లు తింటున్నప్పుడు మనమెందుకు తినకూడదు’’ అని. ఆ తర్వాత ఎవరూ దాని గురించి మళ్లీ అడగలేదు’’ అని తన ఎక్స్​పీరియెన్స్ షేర్​ చేసుకుంది.​

సెలెక్టివ్​గా లీడ్ రోల్స్​
లిజో మొదటి సినిమా నుంచి క్యారెక్టర్​కి ఇంపార్టెన్స్​ రోల్స్ చేస్తూ వచ్చింది. మలయాళం, తమిళం రెండింటిలోనూ గ్లామర్ రోల్స్​ కంటే లీడ్​ రోల్స్​ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరో ఫహాద్​తో కలిసి నటించే ఛాన్స్​ వచ్చింది. దాని తర్వాత 2016లో ‘కట్టప్పనయిలే రిత్విక్​ రోషన్’​సినిమాలో ‘కని’ అనే రోల్​లో నటించింది. ఈ పాత్ర నిడివి ఎక్కువే. ఇది ఆమె రెండో సినిమా. ఒక విధంగా చెప్పాలంటే లిజో మూవీ కెరీర్​లో కొనసాగడానికి పెద్ద ప్లస్​ పాయింట్ ఈ సినిమానే. ఈ సినిమాకు 2017 ‘‘రెండో ఐఫా ఉత్సవం”అవార్డ్స్​లో ‘‘బెస్ట్ పర్ఫార్మెన్స్​ ఇన్​ సపోర్టింగ్​ రోల్​’’కి నామినేట్ అయింది. 

తమిళంలో మొదటి సినిమా ‘స్ట్రీట్ లైట్స్’. మమ్ముట్టితో హీరోగా చేసిన ఈ సినిమాలో లిజో సపోర్టింగ్​ లీడ్ రోల్​లో కనిపించింది. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2020లో వచ్చిన ‘శివప్ప మంజల్ పచ్చయ్​’ (ఒరేయ్​ బామ్మర్ది) సినిమాకుగాను ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్​’గా, ఆనంద ‘వికతన్’​, ‘జీ సినీ అవార్డ్స్​ తమిళ్’ అవార్డులను అందుకుంది. అదే సినిమాకు ‘జెఎఫ్​డబ్ల్యూ’ (జస్ట్ ఫర్ విమెన్​ మూవీ అవార్డ్స్), ‘ఎడిసన్’​, ‘నార్వే తమిళ్ మూవీ అవార్డ్’​లకు ఫిమేల్ కేటగిరీలో ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్​’గా నామినేట్ అయింది.

గ్లిజరిన్​ లేకుండానే ఏడ్చాను
ఈ సినిమాలో నా రోల్ చాలా ఎమోషనల్. ప్రెగ్నెంట్ విమెన్​గా, జైల్లో ఉన్న భర్త కనిపించకపోతే... ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. ఇది నిజంగా జరిగిన కథ అని తెలిసి చాలా ఫీలయ్యా. షాట్ చేసేటప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్​ అయిపోయా. గ్లిజరిన్​ వాడకుండానే ఏడుపొచ్చేది. డైరెక్టర్ కట్ చెప్పినా నేను క్యారెక్టర్​లో నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు. తర్వాత నార్మల్ అవ్వడానికి చాలా టైం పట్టేది.

ఫ్యామిలీ
లిజోమోల్ జోసఫ్​ కేరళలో పుట్టింది. నాన్న రాజీవ్​ జోస్​. అమ్మ లిసమ్మ. లిజోకి ఒక సిస్టర్ ఉంది. తన పేరు లియా జోస్​. లిజో వాళ్ల నాన్న బిజినెస్​ మేన్​. అమ్మ ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​లో పనిచేసింది. లిజో ఈ ఏడాది అక్టోబర్ 5న తన ఫ్రెండ్, బిజినెస్​ మేన్​​ అయిన అరుణ్​​ ఆంటోనిని పెళ్లి చేసుకుంది. 

ఫ్యూచర్​ ప్లాన్స్​
సినతల్లి లాంటి క్యారెక్టర్స్ ఇంక చేయను. ఇలాంటి క్యారెక్టర్సే చేయాలని అని పెట్టుకోలేదు. ఒకేలాంటి రోల్స్​ చేయడం కూడా ఇష్టం లేదు.  అన్ని రకాల క్యారెక్టర్స్​ చేయాలి అనుకుంటున్నా. త్వరలోనే మలయాళంలో నేను చేసిన సినిమాలు రాబోతున్నాయి.