
ఆన్ స్ర్కీన్‌లో కొద్దోగొప్పో తెలుగమ్మాయిలు కనిపిస్తున్నారు. కానీ ఆఫ్ స్ర్కీన్‌లో... అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తెలుగమ్మాయిల్ని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. కేవలం మన దగ్గరే కాదు ఇండియన్ సినిమాలోనే లేడీ డైరెక్టర్ల సంఖ్య చాలా తక్కువ. అలాంటిది ‘వరుడు కావలెను’ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మీ సౌజన్య. టాలీవుడ్లో మహిళా టెక్నీషియన్ల సంఖ్య పెరగాలి.. అది జరగాలంటే ఇండస్ట్రీలోనూ మార్పు రావాలంటున్న ఈ లేడీ డైరెక్టర్ ఎన్నో సవాళ్లని ఎదుర్కొంది. అవే తనని నడిపించాయి అంటున్న లక్ష్మీ సౌజన్య ఇంటర్వ్యూ .
డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నారా?
అనుకున్నది నిజాయితీగా చేస్తే అందరికీ నచ్చుతుందనేది నా నమ్మకం. అది నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా రిలీజయ్యాక నేను ఎక్స్పెక్ట్ చేయనన్ని ఫోన్లు వస్తున్నాయి.‘కథలో ఎమోషన్ని బాగా డీల్ చేశావ్.. క్లాసీగా సినిమా తీశావ్’ అని చెప్తున్నారు అంతా. ఒక అప్‌కమింగ్ డైరెక్టర్‌కి ఇంతకుమించిన తృప్తి ఇంకేం ఉంటుంది. ఫ్యూచర్లో ఏ సినిమా చేసినా అది ప్రేక్షకుల్ని నవ్వించేదో.. లేదా మంచి విషయం ఏదైనా నేర్పించేదో అయి ఉండాలి అనుకుంటున్నా.
సినిమాలోని భూమి(రీతూ వర్మ) క్యారెక్టర్‌కి మీకు ఏమైనా పోలికలున్నాయా?
అవును..భూమిలాగే నాకూ ఆత్మాభిమానం ఎక్కువ. మొండిదాన్ని కూడా. నాలాంటి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అసలు ఆత్మాభిమానం ఉన్న అమ్మాయికి నచ్చాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. ఆకాష్ క్యారెక్టర్లో కూడా కొంచెం నేనున్నా. అలాగే నా చుట్టూ ఉన్న మనుషులు, వాళ్లకి ఎదురైన పరిస్థితులు కూడా ఈ సినిమా కథకి ఇన్స్పిరేషన్. అయితే పెండ్లి కాన్సెప్ట్‌తో చాలానే సినిమాలొచ్చాయి కదా అన్నారు చాలామంది. కానీ, ఏ కథని అయినా ఎంత కొత్తగా చూపించాం. ఎంత అందంగా చెక్కగలిగాం అన్నదే ఇంపార్టెంట్. దాని మీదే సినిమా రిజల్ట్ ఉంటుంది. ఆ విషయంలో నేను వందశాతం సక్సెస్ అయ్యా అనుకుంటున్నా.
ఈ బిగ్ స్ర్కీన్ కల ఎప్పుడు మొదలైంది?
చిన్నప్పట్నించీ నలుగురిలో ఒకదానిలా ఉండటం నచ్చదు నాకు. నా పేరుకి ఒక ప్రత్యేకత ఉండాలి..అందరూ నన్ను గుర్తించాలి అనుకునేదాన్ని. అందుకోసం స్పోర్ట్స్, పాలిటిక్స్, సినిమాల్లో ఏదో ఒక దాంట్లో రాణించాలనుకున్నా. మొదటి రెండింటికి చేతిలో డబ్బు ఉండాలి. దాంతో సినిమాల వైపు నడిచా.అందులోనూ ఎక్కువమందిపైన ప్రభావం చూపించాలంటే డైరెక్షన్ బెస్ట్ అనిపించింది. ఈ మీడియం ద్వారా నా ఐడియాలజీని జనాలకి చూపించొచ్చు. ఎంతోమందిని ఇన్స్పైర్ చేయొచ్చు అనుకున్నా. బాలచందర్, బాలు మహేందర్ మేకింగ్ చూశాక అలాంటి గుర్తుండిపోయే సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యా. ఇదే విషయం నాన్నతో చెబితే చిన్నపిల్ల ఏదో సరదాగా అంటుంది అనుకున్నారు. కానీ, నేను మాత్రం మొండిగా ఇంట్లో వాళ్లు వద్దంటున్నా పద్దెనిమిదేళ్ల వయసులో నా కల నేరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చా.
అయితే...సినిమాల్లోకి రావడం అమ్మానాన్నలకి ఇష్టం లేదా?
నేను పుట్టింది కర్నూలు జిల్లాలోని వెంకటాపురం అనే ఓ చిన్న పల్లెటూళ్లో. పెరిగింది గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో. మా నాన్న ప్రైవేటు స్కూల్ టీచర్. సెలవుల్లో పొలం పనులు చేసేదాన్ని నేను. సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు కదా! సినిమాల పట్ల అవగాహన ఉన్న వాళ్లు కూడా లేరు నా చుట్టుపక్కల. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆడపిల్ల సినిమాలు.. అది కూడా డైరెక్షన్ వైపు వెళ్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా! అదే జరిగింది నా విషయంలోనూ. పెండ్లి చేయాలని చూశారు ఇంట్లో వాళ్లు. కానీ, నేను మాత్రం మొండిగా ఉన్నా.. బలవంతంగా పెండ్లి చేసినా ఉండనని చెప్పా. నా పట్టుదల చూసి నాన్న కన్విన్స్ అయి, సిటీకి తీసుకొచ్చారు. డైరెక్షన్లో రాణించాలంటే ముందు యాక్టింగ్ తెలియాలి. అందుకే హైదరాబాద్ రాగానే కనకాల యాక్టింగ్ స్కూల్లో చేరా. కానీ, హాస్టల్లో అడ్జస్ట్ అవ్వలేకపోయా. దాంతో నా పరిస్థితిని అర్థం చేసుకుని యాంకర్ సుమ వాళ్ల ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈ విషయంలో ఆమెకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి.
ఆ తర్వాత ఏమైంది?
గమ్యం తెలుసు.. కానీ, ప్రయాణం ఎక్కడ్నించి మొదలుపెట్టాలో తెలియలేదు. ఆ దారి పట్టుకోవడానికి డైరెక్టర్ల నెంబర్లు కనుక్కొని ఫోన్లు చేసేదాన్ని. నెలల తరబడి సినిమా ఆఫీసుల చుట్టూ తిప్పించుకునేవాళ్లు చాలామంది. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. తిరిగి ఊరికొచ్చేయమని నాన్న ఫోన్లు. చుట్టాలు, ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు. అయినా సరే ధైర్యం పోలేదు. నా పట్టుదల చూసి అమ్మానాన్న నాకు తోడుగా ఉండేందుకు హైదరాబాద్ వచ్చేశారు. ఆ తర్వాత నేను చేసిన ఒక యాడ్ చూసి తేజగారు ‘ధైర్యం’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అక్కడ్నించీ శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, క్రిష్, మంజుల ఇలా చాలామంది డైరెక్టర్ల దగ్గర పనిచేశా. ఒకేసారి ‘వేదం’, ‘అనగనగా ఒక ధీరుడు’ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. నా కష్టానికి తగ్గట్టే తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా. ఒక వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూనే.. డైరెక్షన్ ఛాన్సుల కోసం ప్రయత్నించా. అవన్నీ ఫలించి 2017 లో మా సినిమా ప్రొడ్యూసర్ చిన్నబాబుగారికి కథ చెప్పే అవకాశం వచ్చింది. ఓ కొత్త లేడీ డైరెక్టర్‌ను నమ్మి ఆయన ఈ సినిమా ఇవ్వడం అదృష్టమనే అనుకోవాలి. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతూ ఇన్నాళ్లకి థియేటర్స్‌లోకి వచ్చింది.
జెండర్ వల్ల అవకాశాలు చేజారాయా?
ఏ లేడీ టెక్నీషియన్‌కి అయినా ఈ సమస్యలు తప్పవు. మొదట్లో ఆడపిల్లని అనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశాలు ఇవ్వలేదు నాకు. కానీ, ఒకసారి అడుగుపెట్టాక అసలు ఆడపిల్లననే విషయమే మర్చిపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఉదయం నాలుగింటికి నిద్రలేవాలి.. ఆరింటికల్లా లొకేషన్లో ఉండాలి. దాదాపుగా పద్దెనిమిది నుంచి పందొమ్మిది గంటలు నిలబడే ఉండాలి. నెలసరి టైంలో అన్నన్ని గంటలు నిలబడి పనిచేయాలంటే ఇబ్బంది అయ్యేది. అవన్నీ మిగతా టెక్నీషియన్లు అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్లు. కానీ, మళ్లీ డైరెక్షన్ కోసం ప్రయత్నించేటప్పుడు ఆడపిల్ల ఇంతమందిని హ్యాండిల్ చేయగలదా? ఆర్టిస్ట్‌లు అందర్నీ ఒక తాటి మీదకి తీసుకురాగలదా? రాత్రింబవళ్లు పనిచేయగలదా? అని ఆలోచించారు. కానీ మన దగ్గర మంచి కథలు ఉంటే జెండర్ పనిలేదు. ఇండస్ట్రీలో ఆడ, మగ ఎవరైనా ఒకటే అని రానురాను అర్థమైంది.
ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్ల సంఖ్య చాలా తక్కువ కదా?
ఇరవైయేండ్లు రాగానే ఆడపిల్లలకి పెండ్లిగోల మొదలవుతుంది. పెండ్లయ్యాక భర్త సపోర్ట్ చేస్తాడో? లేదో? తెలియదు. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంటి బాధ్యతల భారం ఉంటుంది. ఇండస్ట్రీలోని చాలామంది... లేడీ డైరెక్టర్స్ ఎందుకు రావట్లేదో అర్థం కాదు అంటుంటారు. నిజానికి వాళ్లు రావాలంటే దానికి తగ్గ పరిస్థితుల్ని ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీ పై ఉన్న భయాల్ని, అపోహల్ని పోగొట్టాలి. అప్పుడే మహిళా టెక్నీషియన్ల సంఖ్య పెరుగుతుంది.
నలుగురిలో ఎలా గుర్తుండిపోవాలి అనుకుంటున్నారు?
ఇంట్లోవాళ్లు పేరు పెట్టేది పిలవడానికి మాత్రమే కాదు. ఆ పేరుని చెప్పుకునే స్థాయికి మనం ఎదగడానికి. మన పేరుని నలుగురూ గుర్తించడానికి అనేది నా అభిప్రాయం. ఆ స్థాయికి నేను చేరుకోవాలి. మంచి వ్యక్తిగా అందరికీ గుర్తుండి పోవాలి అనుకుంటున్నా. నాలాంటి మరికొందరు ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండాలి నేను.
మీకు లవ్‌స్టోరీ ఏమైనా...?
అంత టైం నాకెక్కడుంది? చిన్నప్పట్నించీ సినిమా చుట్టూరా నా ప్రపంచం తిరిగింది. పైగా చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్ నేను. గడుసుదానిలా కనిపిస్తా. అందుకే ఇప్పటివరకు నాకెవరూ ప్రపోజ్ చేసే సాహసం చేయలేదు.
నాన్న లేనిలోటు తీర్చలేనిది
నాన్నకి క్యాన్సర్ వచ్చింది..ఇంకా ఆరునెలలే టైం ఉందన్నారు డాక్టర్లు. అప్పటివరకు ప్రతి అడుగులో ధైర్యం చెప్పిన నాన్న ఇంక ఉండరన్న నిజాన్ని తట్టుకోలేకపోయా. చివరి రోజుల్లో ఆయన మనసుకి కాస్త ఊరటనిద్దామని ‘పెండ్లి చేసుకోనా’? అని అడిగా. దానికి నాన్న ‘ఒకరి చేతిలో పెట్టి మా అమ్మాయిని బాగా చూసుకోండని చెప్పడానికి నువ్వు వీక్ కాదు. అయినా నువ్వు పెండ్లి చేసుకున్నంత మాత్రాన నేను ఎక్కువ రోజులు బతకను. నువ్వు అనుకున్నది సాధించు.. లేదా జర్నీ చేస్తూ చచ్చిపో’ అని చెప్పారు. ఆ మాటలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. కానీ, నా సక్సెస్‌ని నాన్న చూడలేకపోయారన్న బాధ ఎప్పటికీ ఉంటుంది.
::: మానసి