మాస్కో: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. గురువారం మాస్కోలోని వాల్ డై ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ యానివర్సరీ ప్లీనరీలో పుతిన్ మాట్లాడారు. ‘‘బ్రిటన్ పాలన నుంచి విముక్తి పొందిన ఇండియా అద్భుతమైన అభివృద్ధి సాధించి ఆధునిక దేశంగా అవతరించింది. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇండియాను గౌరవిస్తున్నాయి. కొన్నేండ్లలో ప్రధాని మోడీ హయాంలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఆయన నిజమైన దేశభక్తుడు. ఆయన ఆలోచనల్లోంచి పుట్టిన ‘‘మేకిన్ ఇండియా’’ ఎంతో కీలకమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా.. అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. ఇందుకు ఇండియా గర్వించాలి. ఇండియాకు ఇంకా గొప్ప భవిష్యత్తు ఉంది. ప్రపంచ పాలసీల్లో కీలక పాత్ర పోషించనుంది” అని ఆయన అన్నారు. ఇండియా ఫారిన్ పాలసీ చాలా బాగుందంటూ కొనియాడారు. తన దేశ ప్రజలకోసం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించగల వ్యక్తుల్లో ప్రధాని మోడీ ఒకరని పొగిడారు.
ఫర్టిలైజర్స్ సప్లై పెంచినం...
ఇండియాతో రష్యాకు ప్రత్యేక అనుబంధం ఉందని పుతిన్ చెప్పారు. ‘‘ఇండియా, రష్యా మధ్య దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది. మా మధ్య ఎప్పుడూ ఏ విషయంలోనూ సమస్యలు రాలేదు. మేం ఒకరికొకరం ఎల్లప్పుడూ సహకారం అందజేసుకుంటం. ఇది భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుంది” అని తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత పెరుగుతోందని వెల్లడించారు. ఫర్టిలైజర్స్ సప్లై పెంచాలని మోడీ కోరారని, దీంతో సప్లై 7.6 రెట్లు పెంచామని పేర్కొన్నారు. మిలటరీ, టెక్నికల్ విభాగాల్లో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందన్నారు.
