బతుకమ్మ చీరకు బ్రాండింగ్‌‌

బతుకమ్మ చీరకు బ్రాండింగ్‌‌
  • లోగో రూపొందించండి  ప్రపంచస్థాయి గుర్తింపు తేవాలె

సిరిసిల్ల బతుకమ్మ చీరకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని టీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో చేనేత జౌళిశాఖ అధికారులతో ఎమ్మెల్యే క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో బతుకమ్మ చీరల తయారీ పనులపై ఆయన రివ్యూ మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ ఏడాది తయారవుతున్న బతుకమ్మ చీరలు చాలా అందంగా ఉన్నాయని.. నాణ్యత కూడా బాగుందన్నారు. సిరిసిల్ల బతుకమ్మ చీరకు ప్రత్యేక లోగో రూపొందించాలన్నారు. చీరలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చేలా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. త్వరలో రాష్ట్రంలో చేనేత, పవర్‌‌లూమ్‌‌, టైక్స్‌‌టైల్ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ముందుగా చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌‌ శైలజా రామయ్యర్ బతుకమ్మ చీరల తయారీలో ప్రగతిని వివరించారు. బీపీఎల్‌‌(దారిద్య్రరేక దిగువన) కుటుంబాల్లో మహిళలకు బతకుమ్మ పండుగ సందర్భంగా చీరలను ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.320 కోట్లతో సిరిసిల్లకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్ ఇచ్చిందన్నారు. మొత్తం 6.84 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4.27 కోట్ల మీటర్ల  వస్త్రం తయారైందన్నారు. ఒక చీర తయారీకి రూ.300 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి 100 రంగుల్లో చీరలు ఉంటాయన్నారు. సకాలంలో ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని వివరించారు.

చీరలు గతంలో కంటే చాలా అందంగా, నాణ్యంగా ఉన్నాయని కేటీఆర్‌‌ అధికారులను ప్రశంసించారు. బతుకమ్మ చీరలకు బ్రాండింగ్ క్రియేట్ చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి మహిళా జర్నలిస్ట్‌‌లను సిరిసిల్లకు పిలిపించి బతుకమ్మ చీరల ప్రత్యేకతను వివరించాలన్నారు. త్వరలోనే స్టేట్ మీడియా బృందాన్ని కూడా రప్పించి చీరల తయారీ వివరించాలని సూచించారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా చీరలు ఇవ్వడమే కాకుండా..సిరిసిల్ల నేతన్న సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చామన్నారు. దీని వల్ల ఒక్కోకార్మికుడు నెలకు రూ.20 వేల వరకు సంపాదించుకోగలుగుతున్నారన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సిరిసిల్లలో త్రిప్ట్ పథకం ప్రవేశపెట్టి రూ.1.18కోట్లు మంజూరు చేయించామన్నారు. ఏటా సిరిసిల్ల పవర్ లూమ్‌‌ సెక్టార్‌‌కు రూ.6.10కోట్ల కరెంట్‌‌ సబ్సిడీ కల్పిస్తున్నామన్నారు. ఇలా ఐదేళ్లలో రూ.30.50కోట్లు  చెల్లించడమే కాకుండా అదనంగా టెక్స్‌‌టైల్ పార్క్ విద్యుత్ రాయితీ కోసం రూ.8.20 కోట్లు కూడా ఇచ్చామని వివరించారు. ప్రతి మరమగ్గానికి జియో ట్యాగ్ చేయించామన్నారు. 10 శాతం యార్న్‌‌(దారం) రాయితీ రూ.9కోట్లు విడుదల చేశామన్నారు. రూ.30 కోట్లతో సిరిసిల్లలోని 25 వేల మగ్గాలను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే 12 వేల మగ్గాలు ఆధునికీకరించామన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్మికుడిని యజమానిగా మార్చే ఉద్దేశంతో పెద్దూర్ శివారులో 88 ఎకరాల్లో గ్రూప్ వర్క్ షెడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 1104 కార్మికులకు స్థలం కేటాయించి.. ప్రతి షెడ్డులో నాలుగు ఆధునిక పవర్‌‌లూమ్స్‌‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.426 కోట్ల కేటాయించమన్నారు. అనంతరం సిరిసిల్లలో బతుకమ్మ చీరలు తయారవుతున్న యూనిట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ యాస్మిన్​బాషా, జడ్పీ చైర్మన్​ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.