
తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని టీడీడీ నిర్వహిస్తుంది. ఒక్కోసారి తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరిగే సమయంలో స్వామివారు .. శ్రీదేవి, భూదేవి సమేతంగా మాఢ వీధుల్లో సంచరించి భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ క్రమంలో 2025 ఆగస్టు 4 నుంచి 7 వ తేది వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు జరిపేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నవిధంగా ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో స్వామివారికి ఏడాదిలో 450కి పైగా ఉత్సవాలు జరుగుతున్నాయని వివిధ పురాణాలు ద్వారా తెలుస్తుంది.
ఆగస్టు 4 నుంచి 7 వతేదీ వరకు తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహించాలని పండితులు నిర్ణయించారు. తిరుమల శ్రీవారు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకార ప్రియుడు కూడా. తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్దమయింది.
అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల లేదా సిబ్బంది వల్ల లేక ఆలయ అధికారులు తెలిసో తెలియకో చేసిన చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, దోషాలు అన్నీ ఈ పవిత్రోత్సవాలతో పోతాయి. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం జరుగకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
- ఆగస్టు 4న అంకురార్పణ
- ఆగస్టు 5న పవిత్రాల ప్రతిష్ట
- ఆగస్టు 6న పవిత్ర సమర్పణ
- ఆగస్టు 7న పూర్ణాహుతి కార్యక్రమాలు
చారిత్రకంగా చూస్తే ఈ పవిత్రోత్సవాలు 15వ శతాబ్దం నుంచి కొనసాగుతూ వస్తుంది. 1962వ సంవత్సరం నుంచి తిరుమల దేవస్థానం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ.. నిర్విరామంగా కొనసాగిస్తుంది.
సేవలు రద్దు
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 4న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను రద్ధు చేశారు అధికారులు. ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు సైతం రద్దు చేసింది టీటీడీ.
తిరుమల శ్రీవారి ఆలయం ఒక పవిత్ర స్థలం. ఆలయంలోని పూజలు, సేవలు సక్రమంగా జరగడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో జరిగే వివిధ పూజా కార్యక్రమాల్లో లోపాలు, పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దడానికి, ఆలయ పవిత్రతను కాపాడటానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ద్వారా, స్వామివారి కైంకర్యాలలో జరిగిన దోషాలను పరిహరించిజజ ఆలయ పవిత్రతను, శుద్ధిని పెంపొందింపజేస్తారు.