సైబర్ క్రిమినల్స్కు బ్యాంక్ ఖాతాలిచ్చి.. 10 శాతం కమీషన్.. హైదరాబాద్లో నలుగురు అరెస్ట్

సైబర్ క్రిమినల్స్కు బ్యాంక్ ఖాతాలిచ్చి.. 10 శాతం కమీషన్.. హైదరాబాద్లో నలుగురు అరెస్ట్
  • దేశవ్యాప్తంగా 46 సైబర్ ఫ్రాడ్ కేసులు 
  • ఆ కేసుల్లో కొల్లగొట్టిన డబ్బు వీరి ఖాతాల్లోకి చేరినట్టు గుర్తింపు 

హైదరాబాద్‌‌, వెలుగు: ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌, ఇన్వెస్ట్ మెంట్‌‌ మోసాలకు పాల్పడే కేటుగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సప్లయ్‌‌ చేస్తున్న నలుగురిని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శుక్రవారం అరెస్ట్ చేసింది. నార్సింగికి చెందిన మనుబోతుల శ్రీనివాస్‌‌, నాంపల్లి ఆఘాపురకు చెందిన సయ్యద్‌‌ యూసుఫ్‌‌, బంజారాహిల్స్‌‌కు చెందిన చెక్క యేష్యా, హుమాయున్ నగర్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌ జుబేర్‌‌ అహ్మద్‌‌ ను అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించింది. 

వివరాలను టీజీ సీఎస్‌‌బీ డైరెక్టర్‌‌ శిఖాగోయల్‌‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌‌కు చెందిన ఓ బాధితుడు ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌లో రూ.77 లక్షలు మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో అడిషనల్‌‌ ఎస్పీ బిక్షంరెడ్డి, ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ శ్రీను టీమ్‌‌ దర్యాప్తు చేసింది. 

బాధితుడు కోల్పోయిన డబ్బు శ్రీనివాస్‌‌ మనుబోతుల, సయ్యద్‌‌ యూసుఫ్‌‌, శేఖర్‌‌‌‌ అలియాస్ చెక్క యేష్యా, మహ్మద్‌‌ జుబేర్‌‌ అహ్మద్‌‌ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ నలుగురు నిందితులు సైబర్‌‌ నేరగాళ్లకు మ్యూల్‌‌ బ్యాంక్‌‌ ఖాతాలు ఇవ్వడంతో పాటు సైబర్‌‌ మోసాల్లో కొల్లగొట్టిన నగదు లావాదేవీల్లో10 శాతం కమీషన్‌‌ తీసుకుంటున్నట్లు తేలింది. 

 మొత్తం 46 కేసులతో లింకు.. 

గతంలో సాఫ్ట్‌‌వేర్‌‌ కంపెనీ యజమాని అయిన శ్రీనివాస్‌‌ తన స్నేహితుడు చెక్క యేష్యా ద్వారా ఈ దందాలోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. శేఖర్‌‌ ద్వారా జుబేర్‌‌, అతడి ద్వారా యూసుఫ్‌‌తో శ్రీనివాస్‌‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత శ్రీనివాస్‌‌ బ్యాంకు ఖాతాలోకి రూ.4.3 కోట్ల నగదు బదిలీ జరిగింది. 

వీరి అకౌంట్లలో దేశవ్యాప్తంగా మొత్తం 46 సైబర్‌‌ క్రైం కేసుల్లో కొల్లగొట్టిన డబ్బు డిపాజిట్ అయినట్లుగా సీఎస్‌‌బీ అధికారులు గుర్తించారు. కమీషన్ల కోసం ఇతరులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వవద్దని సీఎస్‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖాగోయల్‌‌ హెచ్చరించారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.