కిచెన్​ తెలంగాణ.. మనసు దోచే సమోస

కిచెన్​ తెలంగాణ.. మనసు దోచే సమోస

సమోస అనగానే ఉల్లిగడ్డ లేదా ఆలుగడ్డతో చేసేవే గుర్తొస్తాయి. కానీ, సమోసాల్లో చాలా రకాలు ఉన్నాయి.  ప్రాంతానికో రకం, దేశానికో రుచితో నోరూరించేస్తున్నాయి. అంతేకాదు.. సమోసా ట్రయాంగిల్​ షేప్​లోనే ఎందుకు ఉండాలి? అందుకే వాటిని చతురస్రాకారంలో, కజ్జికాయల్లా ఇలా పలు రకాల రుచుల్లో, షేపుల్లో చేస్తున్నారు. వాటిల్లో మచ్చుకు కొన్ని ఇవి.

సౌదీ సంబుసా

కావాల్సినవి :

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

చికెన్ ఖీమా - 400 గ్రాములు

వెల్లుల్లి తరుగు, మిరియాల పొడి - ఒక టీస్పూన్,

ఉల్లిగడ్డ - ఒకటి

ఎండు మిర్చి తునకలు - అర టీస్పూన్

పసుపు - పావు టీస్పూన్

ఉప్పు, నీళ్లు - సరిపడా

ఉల్లికాడల తరుగు - పావు కప్పు

మైదా - రెండు కప్పులు 

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు0


తయారీ : పాన్​లో నూనె వేడి చేసి, అందులో చికెన్​ ఖీమా, వెల్లుల్లి తరుగు వేగించాలి. తర్వాత మిరియాల పొడి, ఎండు మిర్చి తునకలు, ఉప్పు వేసి కలపాలి. వాటిని మరికాసేపు వేగించాక ఉల్లిగడ్డ తరుగు వేయాలి. ఆ తర్వాత ఉల్లికాడల తరుగు వేసి కలపాలి. మైదా పిండిని జల్లెడ పట్టి అందులో ఉప్పు, నెయ్యి, నీళ్లు ఒక్కోటిగా వేస్తూ ముద్దగా కలపాలి. పిండి ముద్దకు నూనె రాసి, మూత పెట్టి అరగంటసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని మరోసారి బాగా కలిపి ఉండలు చేయాలి. ఆ ఉండల్ని పెద్ద చపాతీల్లా వత్తాలి.  తరువాత వాటిని గ్లాస్​ లాంటి దానితో గుండ్రంగా కట్ చేయాలి. అందులో స్టఫింగ్​ పెట్టి కజ్జికాయల్లా చివర్లను మూయాలి. ఫైనల్​గా వాటిని వేడి నూనెలో వేగిస్తే సౌదీ సంబుసా రెడీ. 

జపానీ సమోస

కావాల్సినవి :

మైదా - రెండు కప్పులు

నూనె, వాము - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున 

నెయ్యి, ఉప్పు - సరిపడా

పచ్చిమిర్చి - రెండు

పసుపు - అర టీస్పూన్

ఆలుగడ్డలు - ఐదు

జీలకర్ర, సోంపు, అల్లం పేస్ట్​, కారం, చాట్ మసాలా, పావ్ బాజీ మసాలా - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున

తయారీ : ఒక గిన్నెలో మైదా, నెయ్యి, ఉప్పు, వాము వేసి కలపాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కలుపుతూ ముద్దలా చేయాలి. దానిమీద మూతపెట్టి అరగంటసేపు పక్కన ఉంచాలి. పాన్​లో నూనె వేడి చేసి జీలకర్ర, సోంపు, అల్లం పేస్ట్​, పచ్చిమిర్చి తరుగు, కారం, చాట్ మసాలా, పావ్ బాజీ మసాలా, వాము వేసి కలపాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలుగడ్డల్ని మెదిపి అందులో వేయాలి. చిన్న గిన్నెలో నెయ్యి, మైదా వేసి కలపాలి. పిండి ముద్దను ఉండలు చేసి, చపాతీల్లా వత్తాలి. తర్వాత వాటి మీద మైదా మిశ్రమాన్ని పూయాలి. అలా చపాతీలను ఒకదానిమీద ఒకటి ఏడు లేయర్లుగా పెట్టి, వాటన్నింటినీ కలిపి మరోసారి చపాతీలా వత్తాలి. ఆపై తొమ్మిది ముక్కలు చేయాలి. ఒక్కోదాంట్లో ఆలుగడ్డ స్టఫింగ్​ పెట్టి మూసేయాలి. అలా చేసిన సమోసాల్ని వేడి నూనెలో వేగించాలి.

పాకెట్ సమోస

కావాల్సినవి :

క్యాబేజీ తరుగు - ఒక కప్పు

క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ తరుగు, మొక్కజొన్న గింజలు - ఒక్కోటి

అరకప్పు చొప్పున, ఉల్లికాడలు - కొంచెం

వెల్లుల్లి తరుగు, షెజ్​వాన్ సాస్ - రెండు

టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - మూడు

అల్లం తరుగు, చక్కెర, సోయా సాస్, వెనిగర్ - ఒక్కో టీస్పూన్ 

టొమాటో కెచెప్, రెడ్ చిల్లీ సాస్ - ఒక్కో

టేబుల్ స్పూన్, మైదా, నీళ్లు - ఒక్కోటి నాలుగు టేబుల్ స్పూన్ల చొప్పున

నూనె, ఉప్పు, సమోస పట్టీలు (మార్కెట్​లో దొరుకుతాయి) - సరిపడా

తయారీ : ఒక గిన్నెలో క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్​ తరుగు వేసి పైన ఉప్పు చల్లి అన్నీ కలిసేలా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత కాటన్​ క్లాత్​లో వేసి నీళ్లను పిండేయాలి. పాన్​లో నూనె వేడి చేసి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. అందులో బీన్స్ తరుగు, మొక్కజొన్న గింజలు, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్​ తరుగు, ఉప్పు వేసి కలపాలి. టొమాటో కెచెప్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, షెజ్​వాన్ సాస్ వేసి కలపాలి. ఉల్లికాడల తరుగు చల్లాలి. మైదాను ఒక చిన్న గిన్నెలో వేసి, నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత సమోస పట్టీని నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. ఒక షీట్​ అడ్డంగా పెట్టి, దానిపై మైదా వేసి రెండో షీట్​ని నిలువుగా (ప్లస్ గుర్తులా) పెట్టాలి. అందులో స్టఫింగ్​ పెట్టి మైదా పూసి మూసేయాలి. చివర్లలో కూడా కొంచెం మైదా అంటించాక వేడి నూనెలో వేగించాలి. సాస్ కోసం.. పాన్​లో నీళ్లు పోసి, చక్కెర, టొమాటో కెచెప్, వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికిస్తే సరి. 

క్రిస్పీ చికెన్ సమోస

కావాల్సినవి :

నూనె, ఉప్పు - సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్ట్​, ధనియాల పొడి - ఒక టీస్పూన్

పసుపు, మిరియాల పొడి - అర టీస్పూన్

చికెన్ (బోన్​లెస్) - పావు కిలో

కారం - ఒకటిన్నర టీస్పూన్

నీళ్లు - పావు కప్పు

ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు

క్యాప్సికమ్ తరుగు - అర కప్పు

క్రీమ్ - రెండు టేబుల్ స్పూన్లు

చీజ్ తరుగు - అర కప్పు

కొత్తిమీర - ఒక టేబుల్ స్పూన్

కోడిగుడ్డు - ఒకటి

బ్రెడ్​ క్రంబ్స్​ - కొంచెం

తయారీ : ఒక పాన్​లో నూనె వేడి చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేగించాలి. అందులో చికెన్ వేసి ఉడికే వరకు వేగించాలి. ఆ తర్వాత కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. కాసేపు వేగించి, కొన్ని నీళ్లు పోయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ తరుగు, క్రీమ్ వేసి కలపాలి. చీజ్, కొత్తిమీర కూడా వేసి కలపాలి. సమోస షీట్స్​ని కోన్ ఆకారంలో చుట్టి, అందులో స్టఫింగ్ పెట్టాలి. ఆ తర్వాత మైదా మిశ్రమం పూసి చివర్లు మూసేయాలి. వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి, బ్రెడ్​ క్రంబ్స్​లో దొర్లించాలి. తరువాత వేడి నూనెలో వేగిస్తే కరకరలాడే చికెన్ సమోస రెడీ.

పంజాబీ మినీ సింగార

కావాల్సినవి :

మైదా - ఒక కప్పు,

ఉప్పు - సరిపడా

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

నీళ్లు - పావు కప్పు,

కొత్తిమీర - కొంచెం

ఆలుగడ్డలు (ఉడికించి) - మూడు

ఉల్లిగడ్డ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు - ఒక టీస్పూన్

ఎండు మిర్చి తునకలు - అర టీస్పూన్

చాట్ మసాల, జీలకర్ర పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

ఆమ్​ చూర్​ పొడి - పావు టీస్పూన్

నువ్వుల నూనె - ఒక టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో మైదా, ఉప్పు, నూనె వేసి కలపాలి. అందులో నీళ్లు పోసి ముద్దగా కలపాలి. దానిపై కాటన్ క్లాత్ కప్పి 20 నిమిషాలు నానబెట్టాలి. మరో గిన్నెలో ఆలుగడ్డలు వేసి మెదపాలి. అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, ఎండు మిర్చి తునకలు, చాట్​ మసాల, జీలకర్ర పొడి, ఆమ్​ చూర్​ పొడి, ఉప్పు, నువ్వుల నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పిండి ముద్దను ఉండలు చేసి చిన్న చపాతీల్లా వత్తాలి. వాటిని సగానికి కత్తిరించి కోన్​ ఆకారంలో చుట్టాలి. అందులో స్టఫ్​ చేసి చివర్లను నీళ్లతో అంటించాలి. వాటిని వేడి నూనెలో వేసి వేగిస్తే చిట్టి సమోసాలు రెడీ. 

నోట్ : ఈ మధ్య చాలామంది మైదాతో చేసిన వంటకాలు తినడం లేదు. మామూలుగా అయితే సమోసాను మైదాతో చేస్తారు. కానీ మైదా తినడం ఇష్టం లేని వాళ్లు బియ్యప్పిండి, శెనగపిండి, మొక్కజొన్నపిండి వాడి కూడా వీటిని ట్రై చేయొచ్చు. హెల్దీగా, టేస్టీగా సమోసాల్ని ఎంజాయ్​ చేయొచ్చు.