పార్లమెంటు ప్రత్యేక సెషన్ కొత్త బిల్డింగ్‌‌లో..

పార్లమెంటు ప్రత్యేక సెషన్ కొత్త బిల్డింగ్‌‌లో..
  • తొలి రోజు పాత బిల్డింగ్‌‌లో సమావేశాలు ప్రారంభం
  • 19న వినాయక చవితి సందర్భంగా కొత్త బిల్డింగ్‌‌లోకి!
  • భారత్‌‌’పై కేంద్రం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం

న్యూఢిల్లీ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈనెల 18న పాత బిల్డింగ్‌‌లోనే ప్రారంభం కానున్నాయి. తర్వాతి రోజు నుంచి కొత్త బిల్డింగ్‌‌లో సెషన్‌‌లు కొనసాగనున్నాయి. 19న వినాయక చవితి సందర్భంగా కొత్త బిల్డింగ్‌‌లో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈనెల 18 నుంచి 22వ తేదీ దాకా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే స్పెషల్ సెషన్ ఎజెండాను వెల్లడించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జీ20 సదస్సు కోసం పంపిన ఆహ్వానాలపై ‘భారత్’ అని ముద్రించడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ జరుగుతున్నది. 

ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాల్లో.. ఇండియా అధికారిక పేరును ‘భారత్‌‌’గా మారుస్తూ కేంద్రం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇదే సమయంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌‌పైనా బిల్లు పెట్టే అవకాశం ఉందని చర్చ సాగుతున్నది. మరోవైపు ఇది రెగ్యులర్ సెషన్ కాకపోవడంతో.. క్వశ్చన్ అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ఉండవని లోక్‌‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ సెషన్‌‌లో 5 సిట్టింగ్స్ ఉంటాయని, ప్రొవిజనల్ క్యాలెండర్ గురించి ప్రత్యేకంగా సభ్యులకు తెలియజేస్తామని వెల్లడించాయి. 

మే నెలలో ప్రారంభించిన ప్రధాని

కొత్త పార్లమెంటు బిల్డింగ్‌‌ను రూ.971 కోట్ల ఖర్చుతో నిర్మించారు. లోక్‌‌సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది సభ్యులు కూర్చునేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. కొత్త బిల్డింగ్‌‌ను ఈ ఏడాది మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే ఇటీవల ముగిసిన వర్షాకాల పార్లమెంటు సమావేశాలను పాత బిల్డింగ్‌‌లోనే నిర్వహించారు. కొత్త బిల్డింగ్‌‌ను ప్రారంభించినా.. అక్కడ సెషన్ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో స్పెషల్ సెషన్‌‌ను కొత్త బిల్డింగ్‌‌లో కొనసాగించనున్నారు. 

ఫొటో సెషన్ ఇందుకేనా?

ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, జమిలి ఎన్నికలపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడంతో.. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నదని ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంటు సభ్యులతో ఫొటో సెషన్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే కొత్త పార్లమెంటు భవనంలోకి షిఫ్ట్ అవుతున్న ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఫొటో సెషన్ ఏర్పాటు చేశారని తెలుస్తున్నది.