
- రెండ్రోజుల పాటు నిర్వహించే చాన్స్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలను అక్టోబర్‌లో నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఈ మేరకు ఆమోదం తెలపనున్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చట్ట రూపం దాల్చాలంటే దేశంలోని కనీసం సగం అసెంబ్లీలు బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో ఈ బిల్లును ఆమోదించాలని కోరుతూ అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియెట్ త్వరలో లేఖ రాయనున్నారు.
దీని ఆధారంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28న హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ఉంది. ఆ తర్వాత నాలుగైదు రోజులు ఆగి అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశపరిచే అవకాశం ఉంది. ఒకటి, రెండ్రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుతో పాటు గవర్నర్ తిప్పి పంపిన పలు బిల్లులకు ఈ సెషన్‌లో ఆమోదం తెలిపారు. 2021 సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించిన ఎనిమిదో సెషన్‌కు కొనసాగింపుగానే ఈ సమావేశాలు చేపడుతున్నారు.