ఏడ్చినా మ్యూజిక్ విన్నట్టు అనిపించేదట

ఏడ్చినా మ్యూజిక్ విన్నట్టు అనిపించేదట

నీ నవ్వు చెప్పింది నాతో.. నేనెవ్వరో ఏమిటో ..
నీ నీడ చూపింది నాలో.. ఇన్నాళ్ల లోటేమిటో..
‘అంతం’ సినిమాలోని ఈ పాట చాలామంది తెలుగువారికి తెలుసు.
కానీ దీన్ని కంపోజ్ చేసిన వ్యక్తి గురించి తెలుసా...?
ఇదే కాదు.. ఈ సినిమాలోని ఓ మైనా నీ గానం నే విన్నా, ఎంతసేపైనా ఎదురు చూపేనా నా గతి, ఊహలేవో రేగే పాటల్ని కూడా ఒక్కరే ట్యూన్ చేశారు. ఆ ఒక్కరూ మరెవరో కాదు.. కింగ్ ఆఫ్ బాలీవుడ్ మ్యూజిక్ ఆర్‌‌.డి.బర్మన్. మ్యూజిక్ సైంటిస్ట్ అని కోట్లాదిమంది కాంప్లిమెంట్స్ అందుకున్న ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ జయంతి నేడు(జూన్ 27). ఈ సందర్భంగా ఆయన పెంచిన పాటల పూదోటలో ఓసారి విహరించాల్సిందే. 

పంచమ్‌దా
 
రాహుల్ దేవ్ బర్మన్.. ఇదే ఆర్డీ బర్మన్ పూర్తి పేరు. ఈయన 1939లో కోల్‌కతాలో జన్మించారు. తండ్రి సచిన్ దేవ్ బర్మన్ గొప్ప సంగీత దర్శకుడు, గాయకుడు. తల్లి మీరా.. బెంగాలీ లిరిసిస్ట్. చిన్నప్పుడు బర్మన్‌ని అందరూ టుబ్లూ అని పిలిచేవారు. ఆ తర్వాత పంచమ్ అని పిలవడం మొదలుపెట్టారు. అందుకు కారణం ఉంది. ఆయన ఎప్పుడు ఏడ్చినా హిందుస్థానీ సంగీతంలోని ఒక మ్యూజిక్ నొటేషన్‌ విన్నట్టు అనిపించేదట. దాని పేరు పంచమ. అందుకే ఆర్డీ బర్మన్‌ని కూడా పంచమ్‌ అనేవారంతా. ఆ తర్వాతి కాలంలో ఆ పేరే స్థిరపడిపోయింది. ఇండస్ట్రీ వారు కూడా అసలు పేరుతో కాకుండా పంచమ్‌దా అనే పిలిచేవారు.

చిన్న వయసులోనే అరంగేట్రం

నాన్న బాలీవుడ్‌లో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో చిన్నప్పటి నుంచే పంచమ్‌కు సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. నాన్నని గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నారు. చిన్న వయసులోనే ఓ పాట కూడా కంపోజ్ చేశారు. ఎస్‌డీ బర్మన్ దాన్ని ‘ఫన్‌టూష్‌’ అనే సినిమాలో ఉపయోగించారు. ‘ఏ మేరీ టోపీ పలట్‌కే ఆ’ అనే ఆ పాట బాగా క్లిక్ అయ్యింది. గురుదత్ నటించిన ‘ప్యాసా’ మూవీలోని ‘సర్‌‌ జో తేరా చక్రాయే’ పాట కూడా పంచమ్ ట్యూన్ చేసిందే. కొడుకు ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి ఎస్‌డీ బర్మన్.. కొడుక్కి సంగీతంలో శిక్షణనిప్పించారు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ దగ్గర సరోద్, సమతా ప్రసాద్‌ దగ్గర తబలా నేర్చుకున్నారు పంచమ్. సలీల్ చౌదరి కూడా ఆయనకి గురువే. 

వాళ్లిద్దరూ బాగా క్లోజ్

చాలాకాలం పాటు తండ్రి దగ్గరే పంచమ్ అసిస్టెంట్‌గా పని చేశారు. చల్తీకా నామ్ గాడీ, కాగజ్‌కే ఫూల్, తేరే ఘర్‌‌కే సామ్‌నే, బాందినీ, జిద్దీ, గైడ్, తీన్ దేవియా లాంటి సినిమాలకు తండ్రి దగ్గర సహాయకుడిగా ఉన్నారు. ‘సోల్వా సాల్’ అనే సినిమాలోని ‘హాయ్ అప్నా దిల్‌తో ఆవారా’ అనే పాటకు మౌత్ ఆర్గాన్ కూడా వాయించారు. 1959లో ‘రాజ్‌’ అనే సినిమాకి సంగీతం సమకూర్చే ఛాన్స్ వచ్చింది. అయితే రెండు పాటలు రికార్డ్ చేసిన తర్వాత ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి ‘చోటే నవాబ్’ అనే సినిమాకి సంగీతం అందించారు. అది 1961లో విడుదలైంది. నిజానికి ఈ సినిమాకి సంగీతం అందించమని నిర్మాత, నటుడు మెహమూద్.. ఎస్‌డీ బర్మన్‌ను అడిగాడు. కానీ ఆయన బిజీగా ఉండి నో చెప్పారు. దాంతో పంచమ్‌ని తీసుకున్నారాయన. అప్పటి నుంచి వీళ్లిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఎంత క్లోజ్ అంటే.. మెహమూద్ నటించిన ‘భూత్ బంగ్లా’ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు పంచమ్.

కాంబో విత్ కిశోర్ కుమార్.. సూపర్ హిట్

‘తీస్రీ మంజిల్’ సినిమాతో పంచమ్‌ కెరీర్‌‌ మలుపు తిరిగింది. ఇక అక్కడి నుంచి ఆయన సంగీతం బాలీవుడ్‌లో వెల్లువై పొంగింది. ఎక్కడ విన్నా ఆయన పాటలే. బహారోంకే సప్నే, ప్యార్‌‌ కా మౌసమ్, యాదోంకీ బారాత్, పడోసన్, జ్యూయెల్ థీఫ్, ప్రేమ్ పూజారి అంటూ వరుస హిట్స్తో తిరుగులేని ఇమేజ్ సంపాదించారు. కిశోర్‌‌ కుమార్‌‌, బర్మన్ లది సూపర్‌‌ హిట్ కాంబినేషన్. ఈయన పాట పాడారంటే అది కచ్చితంగా హిట్. ఓ మాఝీరే, తుమ్‌ బిన్ జావూ కహా, ఆనేవాలా పల్ జానేవాలా హై, ముసాఫిర్‌‌హూ మై యారో, హమే తుమ్‌సే ప్యార్ కిత్‌నా, తుమ్‌ ఆగయేహో నూర్ ఆగయా, బచ్‌నా యే హసీనో, జై జై శివ్‌ శంకర్, మేరే నైనా.. ఒకటీ రెండూ కాదు, ఇద్దరూ కలిసి ఎన్నో ఆణిముత్యాల్ని సంగీత ప్రియులకు అందించారు. 

పాటల్లో ఎన్నో వేరియేషన్స్

సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ కి వాళ్లు ఫేమస్ అవుతుంటారు. కానీ పంచమ్‌దా అలా కాదు. ‘దమ్‌ మారో దమ్‌’ అంటూ యూత్‌ని ఊపేసే పాటలు చేశారు. ‘మెహబూబా మెహబూబా’ అంటూ ఐటమ్ సాంగ్స్ ని అందించారు. ‘తేరే బినా జిందగీసే కోయీ’ అంటూ విషాద బాణీలు కట్టారు. ‘ఆజా ఆజా మైహూ ప్యార్ తేరా’ అంటూ అల్లరి పాటలూ అల్లారు. బాహోంమే చలే ఆవో, పియా తూ అబ్‌తో ఆజా, చురాలియా హై తుమ్‌నే జో దిల్‌కో, మేరే సప్నోంకే రాణీ కబ్ ఆయేగీ తూ.. ఇలా ఆయన పాటలన్నింటినీ పరిశీలిస్తే చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. ఎలాంటి పాటైనా ఇట్టే చేసేసేవారు. దాన్ని విన్నవాళ్లు కూడా ఇట్టే మైమరచిపోయేవారు. 

బర్మన్ తపన అలా ఉండేది

సినీ సంగీతంలో కొత్త ఒరవడిని సృష్టించారు పంచమ్. అప్పటి వరకు ఉన్న మూస ధోరణులకు కొత్త మెరుగులు అద్దారు. ఎలక్ట్రానిక్ రాక్, డిస్కో వంటి కొత్త విధానాలను జొప్పించడంతో ఆయన పాటలు కొత్తగా అనిపించి అలరించాయి. బెంగాలీ జానపదాన్ని సినీ సంగీతానికి దగ్గర చేసింది కూడా పంచమ్‌దానే. వెస్టర్న్, అరబిక్ సంగీత రీతుల్ని కూడా తన శైలిలోకి మార్చుకున్న మేధావి. వెదురు బొంగులతో, గరుకు కాగితాలతో, బీర్ సీసాలతో కూడా సంగీతాన్ని సృష్టించిన ఘనత ఆయన సొంతం. ఓసారి వర్షపు చినుకుల శబ్దాన్ని రికార్డ్ చేయడం కోసం బాల్కనీలో కొన్ని గంటల పాటు ఉండిపోయారంటే ఆయన తపన అర్థమవుతుంది.

నాగార్జున "అంతం" సినిమా కోసం...

కెరీర్ మొత్తంలో 331 సినిమాలకు పంచమ్‌దా మ్యూజిక్ అందించారు. వాటిలో ఎక్కువ శాతం హిందీ చిత్రాలే. అవి కాక 31 బెంగాలీ, 2 తమిళ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఒరియా, మరాఠీ భాషల్లోనూ ఒక్కో సినిమా చేశారు. ఇక తెలుగులో రెండు సినిమాలకి సంగీతం అందించారు. మొదటిది జంధ్యాల డైరెక్ట్ చేసిన ‘చిన్ని కృష్ణుడు’. ఇందులో మహేష్‌ బాబు అన్నయ్య రమేష్‌ హీరో. ఖుష్బూ హీరోయిన్. ఈ చిత్రానికి ఆర్డీ బర్మన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకెత్తైతే. పాటలు మరోఎత్తు. మౌనమే ప్రియా అంటూ జానకి పాడిన పాట ఎందరికో ఫేవరేట్ సాంగ్ అయ్యింది. ‘జీవితం.. సప్తసాగర గీతం’ అనే సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా తీసిన ‘అంతం’ సినిమా కోసం ఆర్డీ బర్మన్‌తో కొన్ని పాటలు చేయించుకున్నాడు రామ్‌గోపాల్ వర్మ. సినిమా సక్సెస్ కాకపోయినా పాటలు మాత్రం పెద్ద హిట్టయ్యాయి. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్‌‌ మణిశర్మ అందించాడు. అతను, కీరవాణి చెరో పాటనీ కంపోజ్ చేశారు. సినిమాలకు మాత్రమే కాదు.. హిందీ, మరాఠీ భాషల్లో ఐదు టీవీ సీరియళ్లకి కూడా సంగీతం అందించారు బర్మన్.

కాపీ కొట్టారు

కొన్ని సందర్భాల్లో ఆయా దర్శక నిర్మాతల ఒత్తిడి వల్ల కొన్ని హాలీవుడ్ పాటల్ని అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది ఆర్డీ బర్మన్‌కి. నిర్మాత అడిగాడని ‘షోలే’ మూవీలోని ‘మెహబూబా’ పాట కోసం ‘యూ లవ్‌మీ’ అనే పాటను కాపీ కొట్టారు.  నాసిర్ హుస్సేన్ బలవంత పెట్టడంతో ‘మామా వియా’ పాటను ‘మిల్‌గయా హమ్‌కో సాథీ’ సినిమాలో వాడారు. ‘లెట్స్ ట్విస్ట్’ పాటను ‘భూత్ బంగ్లా’ కోసం ‘ఆవో ట్విస్ట్ కరే’ పాటగా మార్చేశారు. ఇంకా వెన్ ఐ నీడ్‌ యూ, ద లాంగెస్ట్ డే లాంటి మరికొన్ని పాటల్ని కూడా కొన్ని పరిస్థితుల్లో కాపీ చేయాల్సి వచ్చింది.

స్విమ్ చేస్తూ.. మౌత్ ఆర్గాన్ వాయించిన పంచమ్

మ్యూజిక్  కంపోజ్ చేయడమే కాదు.. ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించడం కూడా బర్మన్‌కి చాలా ఇష్టం. ముఖ్యంగా మౌత్ ఆర్గాన్ అంటే ప్రాణం. ఎప్పుడు తీరిక దొరికినా దాన్ని వాయిస్తూనే ఉండేవారు. ఇక స్విమ్మింగ్ అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. ఓసారి కోల్‌కతాలోని ఓ ఈవెంట్‌లో హ్యాపీగా స్విమ్ చేస్తూ చాలాసేపు మౌత్ ఆర్గాన్ వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారట. బర్మన్ బాగా పాడతారు కూడా. అరె దిల్‌సే దిల్ మిలే, డోలీ మే సవార్ సజ్‌నీకా ప్యార్, మేరే జీవన్ సాథీ లాంటి సాంగ్స్‌ పాడారు బర్మన్. ఆశా భోంస్లేతో కలిసి పాడిన పియా తూ అబ్‌తో ఆజా, షరాబీ ఆంఖే గులాబీ చెహ్‌రా, దునియా మే లోగోంకో లాంటి పాటలైతే సెన్సేషన్‌ సృష్టించాయి. 

ట్యూన్ వాడుకున్న ఆపిల్ కంపెనీ

‘ది బర్నింగ్ ట్రైన్’ సినిమా కోసం ఆర్డీ బర్మన్ కంపోజ్ చేసిన ఒక పాట ట్యూన్‌ని ఐఫోన్ కంపెనీ వాడేసుకుంది. అది బైటికి వచ్చినప్పుడు బర్మన్ ఫ్యాన్స్ రియాక్టయ్యారు. అలా ఎలా కాపీ కొట్టేస్తారు, కనీసం ఆయనకి క్రెడిట్ కూడా ఇవ్వరా అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. దాంతో కంపోజర్‌‌ పీట్ క్యానన్ స్పందించాడు. ఆ ట్యూన్ కచ్చితంగా ఆర్డీ బర్మన్ కంపోజ్ చేసిన మ్యాజికల్ పీస్ నుంచి తీసుకున్నదేనని, అయితే తాను కాపీ కొట్టలేదని, సరేగమా కంపెనీ నుంచి లీగల్‌గా హక్కుల్ని తీసుకున్నామని క్లారిటీ ఇచ్చాడు.

వివాహ బంధంలో ఇబ్బందులు

పంచమ్ మొదట తన ఫ్యాన్ అయిన రీటా పటేల్‌ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఐదేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ‘ముసాఫిర్‌‌హూ మై యారో’ పాట ఆ బాధలో ఉన్నప్పుడు చేసిందే. ఆ తర్వాత సింగర్ ఆశాభోంస్లేని ఇష్టపడ్డారు బర్మన్. వీరిద్దరిదీ హిట్ పెయిర్. బర్మన్ కంపోజ్ చేసిన ఎన్నో గొప్ప పాటల్ని ఆశ పాడారు. అవార్డులూ, రివార్డులూ అందుకున్నారు. ఇద్దరూ కలిసి లైవ్ కన్సర్ట్స్ కూడా చాలానే చేశారు. ఆ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటికి ఆశ కూడా డివోర్సీనే. పిల్లలు కూడా ఉన్నారు. అయినా పెళ్లి చేసుకుని చాన్నాళ్లు సంతోషంగా జీవించారు. కానీ ఓ సమయం వచ్చాక ఇక కలిసి ఉండలేమంటూ వేరుపడిపోయారు.

మ్యూజిక్ చేస్తానని సైన్ చేశారు.. కానీ అంతలోనే...

కొన్ని దశాబ్దాల పాటు నడిచిన పంచమ్‌దా హవా తర్వాత మెల్లగా తగ్గిపోయింది. వరుస పరాజయాలు వెక్కిరించాయి. వెర్సటాలిటీ తగ్గిపోయిందని, ఇతర సంగీత దర్శకుల ప్రభావం ఆయన పాటలపై కనిపిస్తోందని కామెంట్స్ వచ్చాయి. అందువల్ల అవకాశాలూ తగ్గిపోయాయి. మరోవైపు వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు కూడా కలవరపెట్టాయి. ఆర్థిక సమస్యలూ తలెత్తాయి. దాంతో బర్మన్ చివరి రోజులు చాలా బాధాకరంగా గడిచాయి. 1988లో గుండెపోటు వచ్చింది. సంవత్సరం తర్వాత లండన్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ టైమ్‌లోనూ చాలా పాటలు చేశారు. కానీ అవి విడుదలకు నోచుకోలేదు. విధు వినోద్ చోప్రా ‘పరిందా’ సినిమాకి బర్మన్ వర్క్ చేశారు. ‘గ్యాంగ్’ మూవీ కోసం ఆయన చేసిన ‘చోడ్‌కె న జానా’ పాటను ఆశా భోంస్లేనే పాడారు. కానీ అది రిలీజ్ కాకముందే బర్మన్ చనిపోయారు. ఆ సినిమాలోని మిగతా పాటల్ని అనూ మలిక్ కంపోజ్ చేశారు. ప్రియదర్శన్ డైరెక్షన్‌లో ఓ మలయాళ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి కూడా సైన్ చేసినా అది పూర్తి కాకుండాచేయకుండానే వెళ్లిపోయారు. 

పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు

ఇక ఆర్డీ బర్మన్ అద్భుతమైన సంగీతం అందించిన ‘1942 ఎ లవ్‌స్టోరీ’ సినిమా కూడా ఆయన చనిపోయాకే విడుదలైంది. ఆయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. కానీ దాన్ని అందుకోవడానికి బర్మన్ లేరు. అప్పటికే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. చనిపోయేనాటికి ఆయన వయసు యాభై నాలుగేళ్లు. అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న వయసులో వెళ్లిపోవడం దారుణమని చాలా మంది బాధపడ్డారు. ఆయనతో పని చేసినవాళ్లంతా కలత చెందారు. అజరామరమైన పాటలతో తమ చెవుల్లో అమృతాన్ని పోసిన లెజెండ్ మరణాన్ని సినీ సంగీత ప్రియులు కూడా తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ నాటి పాటల ద్వారా ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఆయన అభిమానులు. ఆ మాధుర్యానికి మనసు పులకరించిన ప్రతిసారీ ‘పంచమ్‌దా.. మీరు గ్రేట్’ అంటూ హ్యాట్సాఫ్ చెబుతూనే ఉన్నారు.