
- ఆదిలాబాద్జిల్లాలో భారీ వర్షం
- ప్రాజెక్టుల్లోకి పెరుగుతున్న వరద
- గండి కొట్టి వరద నీరు విడుదలు చేస్తున్న బల్దియా అధికారులు
- జైనథ్ లో 10.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు
ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్/మంచిర్యాల, వెలుగు: వానలు తగ్గడంలేదు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండడంతో ప్రజలు ఇండ్లలోనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాను వర్షం వీడటం లేదు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జైనథ్ మండలంలో 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మావల, సిరికొండ మండలాల్లో 7 సెంటీమీటర్లు, బేల, గుడిహత్నూర్, ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మండలాల్లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మత్తడివాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కులు, సాత్నాల్ ప్రాజెక్టు 2 గేట్లు ఓపెన్ చేసి 12,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బోరజ్ మండలంలోని తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో తాత్కాలిక వంతెన మునిగిపోయింది. దీంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేసి లాండసాంగ్వి గ్రామం మీదుగా జైనథ్, బేల మండలాలకు వాహనాలు మళ్లిం చారు. మత్తడివాగు గేట్లు ఓపెన్ చేయడంతో అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
చాందాటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో మొకాల్లోతు వరద నీరు చేరడంతో ప్రజలు ఇండ్లలోనుంచి బయటకు రాలేదు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం బోరజ్ మండలంలోని కేదార్పూర్, ఆకోలి, గిమ్మ, కొరాట, మాండగాడ, పూసాయి, పిప్పర్ వాడ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో పర్యటించి రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
20 గ్రామాలకు కనెక్టివిటీ కట్
నిర్మల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 20కి పైగా మారుమూల గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ముఖ్యంగా కడెం, పెంబి మండలాల్లోని ఈ మారుమూల పల్లెలకు ప్రస్తుతం కమ్యూనికేషన్ లేకుండా పోయింది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లు, వంతెనలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. కడెం ప్రాజెక్టు 6 గేట్లను పైకెత్తి 34,493 క్యూసెక్కులకు నీటిని వదులుతున్నారు. గడ్డన్న వాగు ప్రాజెక్టు 3 గేట్లు పైకెత్తి దాదాపు 13వేల క్యూసెక్కులు, స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లను పైకెత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 32 గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో జిల్లాలో ప్రవహించే గోదావరి నది ఉప్పొంగుతోంది. నది పరివాహకంలో ఉన్న నిర్మల్, సోన్, లక్ష్మణ చందా, మామడ, ఖానాపూర్ మండలాల్లోని పలు గ్రామాలను అధికారులు
అప్రమత్తం చేస్తున్నారు.
61 కిలోమీటర్లకు పైగా రోడ్లు ధ్వంసం
జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 61 కిలోమీటర్లకు పైగా రోడ్లు, నాలుగు వంతెన లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీటి రిపేర్ల కో సం దాదాపు రూ.50 లక్షలతో అంచనాలు రూపొందించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 17 సీడీ వర్క్స్, 26 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ.30 లక్షలతో రిపేర్లకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇరిగే షన్ శాఖ పరిధిలో మొత్తం ఐదు ట్యాంక్ బండ్లు, పలు కాలువలు దెబ్బతినడంతో రిపేర్లకు రూ.కోటిన్నరతో అంచనాలు రూపొందించారు.
జనజీవనం అతలాకుతలం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతల మైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. సిర్పూర్ టీ మండలం వెంకట్రావ్‌పేట్ సమీపంలో వార్ధా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. హై లెవెల్ బ్రిడ్జి స్లాబ్‌ను తాకుతూ పారుతోంది. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది సైతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మెట్ల పైకి నీళ్లు చేరాయి.
సిర్పూర్ టి మండలం హుడ్కిలి గ్రామ సమీపంలో ఉన్న లోలెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో సిర్పూర్–మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్ టీ మండలం నుంచి చీలపల్లి వెళ్లే మార్గంలో భారీ వృక్షం కిందపడడంతో కరెంట్ తీగల తెగిపడ్డాయి. కుమ్రంభీం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ రెబ్బెన మండల కేంద్రంలో పర్యటించి లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నల్లబారుతున్న పత్తి చేలు
భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 7,868 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అగ్రికల్చర్ఆఫీసర్ల ప్రిలిమినరీ సర్వేలో తేలింది. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే నష్టం మరింత పెరిగే చాన్స్ఉంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా నీళ్లు నిలువడంతో పత్తి చేలు నల్లబారిపోయి మొక్కలు చనిపోతున్నాయి. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, తాండూర్, కాసిపేట, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి మండలాల్లో ఎక్కువగా నష్టం జరిగింది.
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 17.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని హమాలివాడ, సూర్యనగర్, బృందావన కాలనీ, తిరుమలనగర్కాలనీ, హైటెక్‌సిటీ కాలనీ, రెడ్డికాలనీల్లో రోడ్లు జలమయమై ఇండ్లలోకి నీళ్లు చేరాయి. తిరుమలనగర్కాలనీలో మోకాలి లోతు నీళ్లలోనే పెండ్లి వేడుకలు జరుపుకున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.