
ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు శ్రీ కె.పి.అశోక్ కుమార్ ప్రముఖ తెలంగాణ తొలితరం కథకులపై వెలువరించిన వ్యాస సంపుటే ఈ ‘తెలంగాణ తొలితరం కథకులు– కథన రీతులు’. 1956కి ముందు తెలంగాణలో ప్రఖ్యాతులైన కవులు, వాళ్ల జీవిత, రచనా విశేషాలకు ఈ సంపుటి అద్దం పడుతుంది. ఈ పరిశోధనాత్మక పరిచయ వ్యాసాలు తెలంగాణ కథా సాహిత్య చరిత్ర నిర్మాణంలోనే కాక నిజాం పాలనలో తెలంగాణ సాంస్కృతిక పునర్వికాస ఉద్యమం, సాయుధ రైతాంగ పోరాటం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, రెండు తరాల సామాజిక చరిత్రల మీద అవగాహనకు సైతం ఎంతగానో దోహదం చేస్తుది. ఈ వ్యాసాల ద్వారా తొలితరం కథకుల కాల నిర్ణయం ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది.
ముందుగా ‘మాడపాటి హనుమంతరావు సాహిత్య సేవ’ అనే వ్యాసంలో మాడపాటి వారి రచనలను ప్రస్తావిస్తూనే, ఆయన రచనలు ఎలా నిరాదరణకు గురయ్యాయో తెలిపారు. 1950 నాటి తెలంగాణ ఆంధ్రోద్యమం చరిత్ర అంటే ఒకరకంగా మాడపాటి వారి ఆత్మకథ అనే చెప్పాలి. ఈయన కథాసంపుటి ప్రచురణ కాలం విషయంలో జరిగిన పొరపాట్లను సైతం రచయిత ఎత్తిచూపారు. అలానే ఆయన కథల్లో ఎక్కడా ఆధునికత, సమకాలీనత, నవ్యత ఉండకపోవడంతో పాటు రచనాశైలి గ్రాంథికంలో ఉండటం మైనస్ పాయింట్ అని వ్యాఖ్యానించారు. ‘ఆదిరాజు వీరభద్రరావు కథలు’ అనే వ్యాసంలో వీరభద్రరాజు గారి జీవిత విశేషాలతో పాటు ఆయన రాసిన కథల్లో లభించిన ఆరు కథలను విశ్లేషించి, వాటి గొప్పదనాన్ని వివరించారు.
‘వడ్డేపల్లి సోదరుల కథలు’ అనే వ్యాసంలో వడ్డేపల్లికి చెందిన బెల్లంకొండ నరసింహాచార్యులు, బెల్లంకొండ వెంకటాచార్యులు అనే ఇద్దరన్నదమ్ములకి ‘వడ్డేపల్లి సోదరులు’ అనే పేరు ఎలా వచ్చిందో ప్రస్తావిస్తూ, ఈ ఇద్దరూ కలిసి, అలానే విడివిడిగా కథలు రాశారని తెలిపారు. వీరి కథలు సరళ గ్రాంథికంలో ఉంటూ, ఇప్పటికీ పాఠకుల్ని చదివిస్తాయని తెలిపారు.
‘ఒద్దిరాజు సోదరుల కథలు’ అనే వ్యాసంలో ఇనుగుర్తికి చెందిన ఒద్దిరాజు సీతారామచంద్రారావు, ఒద్దిరాజు రాఘవరావు అనే అన్నదమ్ముల గురించి వివరిస్తూ, కొత్తదనం వీరిద్దరి జీవితాల్లోనూ కనిపించే ప్రధాన అంశంగా రచయిత ప్రస్తావించారు. ‘నందగిరి వెంకటరావు కథనరీతుల విశ్లేషణ’లో ఆయన రచనా శైలి గురించి వివరించారు.
‘విలక్షణ కథకుడు సురవరం ప్రతాపరెడ్డి’ వ్యాసంలో కవితలు, నాటకాలకన్నా ఆయన కథానికలు ఎక్కువ వ్యాప్తి పొందాయని తెలిపారు. వీరి రచనల్లో వ్యంగ్యం ప్రధానంగా ఉండి పాఠకుల్ని అలరించినట్లు చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ‘వెల్దుర్తి మాణిక్యరావు’, ‘భాస్కరభట్ల కృష్ణారావు’, ‘నెల్లూరు కేశవస్వామి’ లాంటి దాదాపు 30 మంది కవుల గురించి ప్రస్తావిస్తూ ఈ సంపుటిని తీసుకొచ్చారు.
-పి. రాజ్యలక్ష్మి