ఫోన్ ట్యాపింగ్​లో ఇద్దరు సీఐలు!

ఫోన్ ట్యాపింగ్​లో ఇద్దరు సీఐలు!
  •     అదుపులోకి తీసుకుని విచారిస్తున్న స్పెషల్ టీమ్ 
  •     వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్లిద్దరూ డ్యూటీ
  •     పర్వతగిరి, సిరిసిల్లలోని వార్ రూమ్స్ ఆపరేట్ 
  •     పర్వతగిరిలోని సర్వర్ స్వాధీనం 
  •     ఓ మాజీ మంత్రిని విచారించేందుకు రంగం సిద్ధం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని పేర్లు బయటకొస్తున్నాయి. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న స్పెషల్ టీమ్.. ఆయనిస్తున్న సమాచారం ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఇద్దరు సీఐలను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 

వాళ్లిద్దరినీ వరంగల్ నుంచి హైదరాబాద్ కు తరలించి సీక్రెట్ ప్లేసులో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ వరంగల్‌‌‌‌ లోని పర్వతగిరి, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్‌‌‌‌‌‌‌‌రూమ్స్​ను ఆపరేట్‌‌‌‌ చేసినట్టు గుర్తించారు. ఓ మాజీ మంత్రికి అనుకూలంగా ఆపరేషన్స్‌‌‌‌ నిర్వహించేందుకే పర్వతగిరిలో వార్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌ ఏర్పాటు చేసినట్టు అనుమానిస్తున్నారు. 

దీనికి సంబంధించిన సర్వర్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రిని విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. 

లీడర్ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 

కస్టడీలో భాగంగా మంగళవారం మూడో రోజు బంజారాహిల్స్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో ప్రణీత్ రావును అధికారులు విచారించారు. లాగర్‌‌‌‌ రూమ్‌‌ ఆపరేషన్స్‌‌లో పాల్గొన్నోళ్ల  వివరాలను సేకరించారు. ప్రణీత్‌‌రావుతో కలిసి పని చేసిన ఇన్‌‌స్పెక్టర్ స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం నల్గొండ జిల్లా యూనిట్‌‌కి చెందిన సీఐ ధనుంజయ్‌‌ని విచారించారు. లాగర్ రూమ్‌‌, అనధికారిక వార్‌‌‌‌రూమ్‌‌లను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారుల చిట్టా సిద్ధం చేస్తున్నారు. 

ఈ క్రమంలో పోలీసులతో కలిసి అక్రమాలకు పాల్పడిన వరంగల్‌‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసు ఉచ్చు బిగుస్తున్నది. ప్రణీత్‌‌రావు ఇస్తున్న సమాచారం ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారిస్తున్న స్పెషల్ టీమ్.. ట్యాపింగ్‌‌లో వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 

ప్రైవేట్‌‌ వ్యక్తుల కోసం ఆపరేషన్స్‌‌..

ప్రభుత్వానికి అవసరమైన సమాచారం కంటే ప్రైవేట్‌‌ వ్యక్తుల కోసమే ప్రణీత్‌‌రావు టీమ్‌‌ ఎక్కువగా పని చేసినట్టు అధికారులు గుర్తించారు. రెండు మీడియా సంస్థలకు చెందిన ప్రముఖులు, రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులు అందించిన ఫోన్‌‌ నంబర్స్‌‌ను ట్యాప్‌‌ చేసినట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారులను కూడా టార్గెట్‌‌ చేసినట్టు స్పెషల్‌‌ టీమ్‌‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. 

ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్టు సమాచారం. సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వ్యాపారాలు చేసే వారిని బెదిరించి, పెద్ద మొత్తంలో వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలిందని తెలిసింది. బాధితుల్లో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖుల బంధువులు, బిజినెస్ పార్ట్‌‌నర్స్‌‌ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ప్రణీత్​రావు అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ఒక విధానమంటూ  లేకుండా ఇష్టం వచ్చినట్లు తనను విచారిస్తున్నారంటూ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం విచారించింది. ప్రణీత్ రావు అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరావును ఆదేశించింది.  తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత కస్టడీకి అప్పగించే సమయంలో ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, పోలీసులు ఇష్టం వచ్చినట్లు దర్యాప్తు చేస్తున్నారని ప్రణీత్ రావు తన పిటీషన్ లో పేర్కొన్నారు.  

రోజుకో స్టేషన్ తిప్పుతున్నారని, రాత్రి 8 గంటల తర్వాత కూడా విచారణ చేస్తున్నారని వివరించారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారి కూడా అందులో పాల్గొంటున్నారని చెప్పారు. విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్  ట్యాపింగ్, కంప్యూటర్ హార్డ్ డిస్క్  ధ్వంసం కేసులో ప్రణీత్ రావును  పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.