తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు..8 రైళ్లకు అదనపు స్టాపులు

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు..8  రైళ్లకు అదనపు స్టాపులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకినాడ టౌన్‌ టూ -లింగంపల్లి టూ  -కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే  ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి 13  వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ నుంచి రాత్రి 8.10గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు లింగంపల్లి చేరుకోనుంది. అలాగే  మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.25గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10గంలకు కాకినాడకు చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం పట్టణం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్‌, విజయవాడ జంక్షన్‌, గుంటూరు జంక్షన్‌, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఏసీ 2 టైర్‌, ఏసీ 3 టైర్‌తో పాటు స్లీపర్‌, జనరల్‌ సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. 

మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు స్టాప్‌ లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆరు నెలల పాటు 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇకపై అదనంగా కేటాయించిన స్టేషన్లలోనూ ఆగుతాయని పేర్కొంది.  ఆగస్టు 23వ తేదీ నుంచి SSN హుబ్లీ - హైదరాబాద్‌ SSN  హుబ్లీ మధ్య నడిచే 17319, 17320 నెంబర్లు గల రైళ్లు హోత్గి స్టేషన్‌లో ఆగుతాయి. అలాగే విశాఖ నుంచి ముంబై ఎల్‌టీటీ - విశాఖకు మధ్య సేవలు అందించే 18519, 18520 నెంబర్ల రైళ్లు, కాకినాడ - ముంబై - కాకినాడ మధ్య తిరిగే 17221, 17222 నెంబర్ల రైళ్లు కల్యాణ్‌ స్టేషన్‌లోనూ  ఆగనున్నాయి. వీటితో పాటు  ఆగస్టు 24వ తేదీ నుంచి విశాఖ - షిరిడి- విశాఖ మధ్య వారానికి ఒకరోజు తిరిగే 18503, 18504 నెంబర్లు గల రైళ్లను కోపర్‌గాన్‌లో స్టేషన్‌లోనూ కాసేపు ఆపనున్నారు.