
భూముల సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు, ఆర్వోఆర్‌ల స్థానంలో తీసుకొస్తున్న కంక్లూజివ్ టైటిళ్లపై తలెత్తే భూవివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునళ్లు, అప్పీలేట్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కంక్లూజివ్ టైటిల్స్ ఇచ్చేందుకు 2007లో కూడా అప్పటి ఉన్నతాధికారులు ఏపీ ల్యాండ్ అథారిటీ యాక్ట్ డ్రాఫ్ట్‌ను రూపొందించారు. భూవివాదాల పరిష్కారాన్ని రెవెన్యూ అధికారులకే కట్టబెట్టి, సివిల్ కోర్టులను దూరం పెట్టారు. ఈ అంశాన్ని అప్పటి న్యాయ నిపుణులు తప్పుబట్టినట్లు తెలిసింది. మళ్లీ అలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. భూవివాదాల పరిష్కారంలో సివిల్ కోర్టులకు చెందిన జడ్జిలు, లాయర్ల భాగస్వామ్యం ఉండేలా లీగల్ ఫ్రేమ్ వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబోయే ఈ ట్రిబ్యునళ్లకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలిసింది. జిల్లా, అప్పీలేట్ ట్రిబ్యునల్, అప్పీళ్ల కోసం హైకోర్టులో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన అధికారుల నేతృత్వంలో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీరు ఫుల్‌టైం కేసుల విచారణకే పరిమితం కానున్నారు. అధికారులు జారీ చేసే కంక్లూజివ్ టైటిళ్లపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే బాధితులు మొదట జిల్లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ఇరుపక్షాల వాదనలు, ఆధారాలను పరిశీలించి ట్రిబ్యునల్ తీర్పులు ఇస్తుంది. ఒకవేళ ఈ తీర్పు నచ్చని పక్షంలో ఫిర్యాదుదారులు జిల్లా స్థాయిలోనే ఏర్పాటు కానున్న అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిసింది.