‘జన నాయగన్’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది. కాసేపటి క్రితమే సినిమా విడుదలను ఆపవద్దంటూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం (జనవరి 9, 2026) నాడు హైకోర్టు సింగిల్ బెంచ్, KVN ప్రొడక్షన్స్ LLP దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుమతిస్తూ, ఈ చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCను ఆదేశించింది. ఈ క్రమంలోనే విడుదలకు సంబంధించిన ప్రధాన అడ్డంకులు తొలగినట్లే అని విజయ్ ఫ్యాన్స్ సంతోషపడ్డారు. అంతలోనే ‘జన నాయగన్’ విడుదల విషయంలో మరో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది.
హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన U/A సర్టిఫికెట్ తీర్పును సవాల్ చేస్తూ, సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ తీర్పును పునర్విచారించాలంటూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈరోజు (జనవరి 9) మధ్యాహ్నం 2:15 గంటలకు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. దీంతో ‘జన నాయకుడు’ సినిమా విడుదలపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయమే ఈ సినిమా విడుదల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
డివిజన్ బెంచ్ కీలక పరిణామం:
ప్రధాన న్యాయమూర్తి మనింద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్లతో కూడిన ఫస్ట్ డివిజన్ బెంచ్, CBFC తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఏఆర్.ఎల్. సుందరేశన్ చేసిన అత్యవసర విచారణ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడానికి అంగీకరించింది. CBFC దాఖలు చేయనున్న అప్పీల్ కేసు నంబర్ నమోదు అయితే, శుక్రవారం మధ్యాహ్నమే విచారణ జరిపే అవకాశం ఉంది. లేకపోతే, జనవరి 12 (సోమవారం) నాడు ఈ కేసును విచారించే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.
Also Read : : ‘జన నాయగన్’కు గ్రీన్ సిగ్నల్
నిర్మాతల వాదన:
‘జన నాయగన్’ నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది సతీష్ పరాసరణ్, విజయన్ సుబ్రమణియన్ సహకారంతో వాదనలు వినిపించారు.
CBFCలోని ఎగ్జామినింగ్ కమిటీ ఇప్పటికే U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సిఫారసు చేసిందని, అయితే CBFC చైర్మన్ ఏకపక్షంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారని ఆయన కోర్టుకు తెలిపారు.
అంతేకాదు, ఈ సినిమాపై సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టామని, జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, CBFC తన నిర్ణయాన్ని జనవరి 5న మాత్రమే తెలియజేయడంతో.. విడుదల ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయని నిర్మాతల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
