వెలుగు క్యాలెండర్కు విశేషాదరణ

వెలుగు క్యాలెండర్కు విశేషాదరణ

తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంటున్న వెలుగు క్యాలెండర్లు విశేషాదరణ పొందుతున్నాయి. విలేజ్ లైఫ్ను ఆవిష్కరించే చిత్రాలు, శిల్పకళా సౌందర్యం వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. 2020 నుంచి 2023 వరకు రూపొందించిన క్యాలెండర్లు తెలంగాణ విశిష్టతను, గ్రామీణ జీవన సౌందర్యాన్ని విప్పిచెప్పేలా ఉన్నాయి. 

చారిత్రక సొబగులు

2020లో శిల్పకళా సంపదకు సంబంధించిన ఫొటోలతో వెలుగు క్యాలెండర్ రూపొందింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రామప్ప దేవాలయం, తెలంగాణ కైలాసంగా పేరుగాంచిన ఎములాడ రాజన్న మందిరం.. హైదరాబాద్ కీ షాన్ చార్మినార్.. నిజాం నవాబుల పాలనకు సాక్ష్యంగా నిలిచిన మొజాం జాహీ మార్కెట్, మూసీ తీరాన రాజసం ఉట్టిపడేలా నిర్మితమైన హైకోర్టు భవనం, గోదావరి తీరాన వెలసి దక్షిణాది సాకేతపురిగా వెలుగొందుతున్న భద్రాద్రి, ఎలగందుల ఖిల్లా.. బాదామీ చాళుక్యుల వారసత్వ సంపదగా పేరొందిన అలంపూర్ ఆలయాలు.. డిచ్ పల్లి ఖిల్లా రామాలయం.. బ్రిటీషర్ల కాలంలో నిర్మితమైన మెదక్ చర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతం

2021లో రూపొందించిన క్యాలెండర్ కులవృత్తులను ప్రతిబింబించేలా ఉండటం మరో విశేషం. చేతి వృత్తులకు ప్రాధాన్యమిస్తూ.. వృత్తుల్లో మహిళల భాగస్వామ్యాన్ని, గ్రామీణ జీవన సౌందర్యాన్ని వివరించేలా అందించింది వెలుగు. గంగిరెద్దుల విన్యాసాలు, కుండలు తయారు చేస్తున్న కుమ్మరి మహిళ, చేనేత పనిలో నిమగ్నమైన అవ్వ, పశు పోషణను ప్రతిబింబించే చిత్రం, సారెపై తన నైపుణ్యాన్ని రంగరించి కుమ్మరి తయారు చేస్తున్న కుండలు, జీవాల మందను తోలుకుపోతున్న యాదవుడి చిత్రాలు వీక్షకులను కట్టిపడేశాయి. మోకు, ముస్తాదుతో వృత్తిలో నిమగ్నమైన గీత వృత్తిదారులు, పంటలను కాపాడుకునేందుకు రైతు ఒడిశెను వినియోగిస్తుండటం నవతరానికి అలనాటి ఆయుధాలను విడమర్చినట్టుగా తీర్చిదిద్దింది వెలుగు దినపత్రిక. నవనాగరిక చట్రాల కింద నలిగిన కంచర వృత్తిని గుర్తు చేసింది. బిందెలు, వంట పాత్రల తయారీ గ్రామీణ ప్రాంతాల్లోనే సాగేదని, గ్రామాల్లోని వృత్తిదారులు స్థానిక అవసరాలు అక్కడే తీర్చేవారని గత వైభవాన్ని కళ్లకు కట్టింది. గంపలు, బుట్టల తయారీ చిత్రాలు, వాటికి ఆధునిక సొబగులద్దే ఫొటోలు ఆకట్టుకునేలా ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. 

మన జాతరలు.. మన సంస్కృతి

2022 క్యాలెండర్కు మరో విశిష్టత ఉన్నది. తెలంగాణ జాతర్లు, ఉత్సవాలకు ప్రాధాన్యం దక్కింది. మేడారం, నాగోబా జాతర్ల వ్యూ ఫొటోలు.. వన దేవతల గద్దెలు ప్రత్యేక ఆకర్షణ. పోలేపల్లి ఎల్లమ్మ సిడే ఉత్సవం మరో ప్రత్యేకత. కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం చిత్రం, బోనాలను సిద్ధం చేస్తున్న మహిళ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. గుడిసెవాసుల ఆరాధ్య దైవం కాకా వెంకటస్వామి స్మృతివనం.. హైదరాబాద్ కే తలమాణికంగా సాగే గణేశ్ ఉత్సవాల్లో జయజయధ్వానాల మధ్య నిమజ్జనానికి తరలుతున్న ఖైరతాబాద్ బడా గణేశ్, ప్రతి ఊరును పూలవనంగా మార్చే బతుకమ్మ పండుగ, ఎడ్ల బండ్లపై తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి మన్యంకొండ జాతరకు తరలివస్తున్న గ్రామీణుల చిత్రాలు అస్తిత్వానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కార్తీకమాసంలో వైభవంగా సాగే లింబాద్రి గుట్ట జాతరను ప్రతిబింబించే చిత్రాలుండటం విశేషం. ప్రతి పూర్వ జిల్లాకు సంబంధించిన చిత్రం వెలుగు క్యాలెండర్లలో ఉండటంతో అన్ని జిల్లాల ప్రజలను ఆకట్టుకున్నది. 

అడవి బిడ్డలకు అందలం

2023లో రూపుదిద్దుకున్న క్యాలెండర్ ఆదివాసీలు, చెంచులు, గోండు, గొత్తికోయల జీవన చిత్రాన్ని ఆవిష్కరించింది. అడవి తల్లి ఒడిలో ఆటపాటలతో సాగే ఆ జీవన మాధుర్యాన్ని ప్రపంచానికి విప్పిచెప్పింది. పచ్చని చెట్లు, గలగలపారే సెలయేళ్ల మధ్య సాగే అడవిబిడ్డల శ్రమైక జీవన సౌందర్యాన్ని వివరించింది.  కల్మషంలేని బిడ్డల ఆటపాటలను ఆవిష్కరించింది.